Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది.
(Photo: Instagram)
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. తన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు మైక్రోసాఫ్ట్ ఇండియా సీఓఓగా తాజాగా నియమితురాలైన ఇరీనా ఘోస్. రెండు దశాబ్దాలుగా ఈ సంస్థలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన ఆమె.. ఓ సమాజ సేవకురాలు కూడా! చదువే అమ్మాయిల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుందంటోన్న ఇరీనా.. STEM వంటి విభాగాల్లో మహిళల ఉనికిని పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అంతేనా.. మరోవైపు రన్నర్‌గానూ తన అభిలాషను నెరవేర్చుకుంటుంటారు. ‘కెరీర్‌ను, కుటుంబాన్ని బ్యాలన్స్ చేయడంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు.. అయినా ఆ ప్రయత్నాన్ని ఆపకూడదం’టోన్న ఈ లేడీ బాస్ జీవితంలోని ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే!
‘పని పట్ల జిజ్ఞాస, ఉత్సాహం.. ఈ రెండూ ఉన్నప్పుడే చేసే పని బోర్ కొట్టదు.. మైక్రోసాఫ్ట్ ఇండియాలో పనిచేస్తోన్న క్రమంలో తాను నేర్చుకున్నది ఇదే’ అంటున్నారు ఇరీనా ఘోస్. IIT (BHU)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆమె.. జార్ఖండ్‌లోని XLRI లో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తయ్యాక హెచ్‌సీఎల్, విప్రో.. వంటి ప్రముఖ కంపెనీల్లో కొన్నేళ్ల పాటు పనిచేసిన ఇరీనా.. 2001లో మైక్రోసాఫ్ట్ ఇండియాలో చేరారు.
రెండు దశాబ్దాల అనుబంధం!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియాతో ఇరీనా ఘోస్‌కు సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ సంస్థలో ‘రీజనల్ అలయన్స్ మేనేజర్’గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. వివిధ విభాగాల్లో, వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఇక మొన్నటిదాకా ‘క్లౌడ్ సొల్యూషన్స్’ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించిన ఇరీనా.. తాజాగా ఈ కంపెనీ సీఓఓగా నియమితులయ్యారు. దీంతో ‘ఇకపై కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇరీనా ఆధ్వర్యంలోనే జరగనున్నాయం’టూ మైక్రోసాఫ్ట్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఈ డిజిటల్ ప్రయాణంలో ఉద్యోగులతో, వినియోగదారులతో మరింత చేరువగా పనిచేసే అవకాశం దొరికింది. ఇప్పటిదాకా నేను నేర్చుకున్న నైపుణ్యాలతో కంపెనీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రయత్నిస్తాను. అలాగే సరికొత్త నైపుణ్యాలతో కూడిన వేదికలను యువతకు అందించేందుకు కృషి చేస్తా. కంపెనీతో ఇన్నేళ్ల నా ప్రయాణంలో పని పట్ల ఉత్సాహం, జిజ్ఞాస ఎలా చూపాలో నేర్చుకున్నా.. ఇదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇరీనా.
సమాజానికి తన వంతుగా..!
మనం మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సమాజ సేవ కోసం కాస్త సమయం కేటాయించాలంటారు ఇరీనా. ఈ క్రమంలోనే తాను ఓవైపు కెరీర్‌లో కొనసాగుతూనే.. మరోవైపు 2010లో ‘మై లిటిల్ బిట్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. నిరుపేద అమ్మాయిలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు స్కాలర్‌షిప్స్ అందిస్తూ వారిని ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే వారికి STEM, నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తున్నారు.
‘నేను విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి చదువు విలువేంటో నాకు తెలుసు. నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎంతోమంది అమ్మాయిలు వివిధ కారణాల రీత్యా చదువుకు దూరమవడం గమనించా. ఎలాగైనా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనుకున్నా. అందుకే ‘మై లిటిల్ బిట్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. చదువే అమ్మాయిలకు ఈ సమాజంలో ఓ విలువ, గౌరవం అందిస్తుంది..’ అంటారు ఇరీనా.
జీవితం పిజ్జా లాంటిది..!
కెరీర్, కుటుంబం, సమాజ సేవతో ఎప్పుడూ బిజీగా ఉన్నా తన అభిరుచుల పైనా దృష్టి సారిస్తుంటారీ లేడీ బాస్. ఈ క్రమంలో తనకు ఇష్టమైన పరుగును ఆస్వాదిస్తూ.. అప్పుడప్పుడూ పలు మారథాన్‌లలోనూ పాల్గొంటుంటానని చెబుతున్నారామె. అంతేకాదు.. ఆమె ఓ మ్యూజిక్ లవర్ కూడా! ‘నేను స్వతహాగా రన్నర్‌ని. పరుగు మనలో పట్టుదలను పెంచుతుంది. మనల్ని ఫిట్‌గా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారిలా మార్చుతుంది. చాలామంది పరుగును ఓ క్రీడగానే భావిస్తారు. కానీ దీనిలా వేగంగా, పరిణతితో కూడిన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఎదగగలం. వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారు ఇంటిని-పనిని బ్యాలన్స్ చేయలేరనుకుంటారు. కానీ బ్యాలన్స్ విషయంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు.. అలాగని దాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నించే పట్టుదల కావాలి. అందుకే పిజ్జాలోని లేయర్లలా.. కుటుంబం, పని, స్నేహితులు, స్వీయ ప్రేమ, సమాజానికి మన వంతుగా తిరిగివ్వడం.. వీటన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే అసలైన జీవితం!’ అంటూ తన సక్సెస్ సీక్రెట్ గురించి పంచుకున్నారీ టెకీ బాస్.
2016 నుంచి ‘Sonder Connect’ సంస్థ ట్రస్టీగా కొనసాగుతోన్న ఇరీనా.. ఈ వేదికగా దేశంలోని మహిళలు నాయకత్వం వహిస్తోన్న స్టార్టప్‌లకు ఊతమిస్తున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపిన చొరవ, సేవలకు గుర్తింపుగా.. 2017లో మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి ‘ఇన్‌స్పిరేషనల్ వుమన్’ అవార్డ్ అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
-
Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన