Gautam Adani: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ

భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌తో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు.

Updated : 21 Apr 2022 18:20 IST

అహ్మదాబాద్‌: భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌తో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. రెండురోజుల భారత పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌.. నేడు అహ్మదాబాద్‌ నగర శివారులోని శాంతిగ్రామ్‌లో ఉన్న అదానీ గ్రూప్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పునరుత్పాదకత, నూతన శక్తి వనరులు, పలు రంగాల్లో యూకే కంపెనీలతో కలిసి పనిచేసే అంశాలపై యూకే ప్రధానితో అదానీ చర్చించారు.

‘గుజరాత్‌లో పర్యటిస్తోన్న  బ్రిటన్‌ ప్రధానికి అదానీ ప్రధానకార్యాలయంలో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. పునరుత్పాదకత, గ్రీన్‌ హైడ్రోజన్‌, నూతన శక్తి వనరులపై దృష్టిసారిస్తూ వాతావరణం, సుస్థిరతకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది. రక్షణ, ఏరోస్పేస్‌ సాంకేతికతలో యూకే కంపెనీలతో కలిసి పనిచేస్తాం’ అని యూకే ప్రధానితో భేటీ అనంతరం గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. అయితే, 2030 నాటికి సాయుధ బలగాల నవీకరణకు 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోన్న తరుణంలో ఆయా విభాగాల్లో కలిసి పనిచేయడంపైనా వీరు ఇరువురు చర్చించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదిలాఉంటే, గతేడాది అక్టోబర్‌లో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు సందర్భంగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు భేటీ అయ్యారు. క్లీన్‌ ఎనర్జీ కోసం కొనసాగుతోన్న ప్రయత్నాలకు తాము నిబద్ధతతో పనిచేస్తున్నట్లు ఇరువురు ఉద్ఘాటించారు. తాజాగా జరిగిన భేటీలోనూ పలు అంశాలపై అదానీతో చర్చించిన బ్రిటన్‌ ప్రధాని.. అనంతరం వడోదరలోని బ్రిటీష్‌ పరికరాల తయారీ కంపెనీ సందర్శనకు బయలుదేరారు. అక్కడ నుంచి శుక్రవారం దిల్లీ వెళ్లనున్న ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని