BS 6 2.0: ఏప్రిల్ నుంచి అమల్లోకి బీఎస్ 6 కొత్త నిబంధనలు.. ఏమేం మారుతాయ్!
ఏప్రిల్ నుంచి కేంద్రం బీఎస్ 6 రెండో దశ (BS 6 2.0)ను అమలు చేయనుంది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి, ఇవి వాహనాలు కొనుగోలు చేసే వారిపై, ఆటోమొబైల్ (Automobile) సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే వివరాలు.
దిల్లీ: వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల క్రితం బీఎస్ 6 ప్రమాణాలను ప్రభుత్వం అమలుచేసింది. ఆ సమయంలో బీఎస్ 4 వాహనాలను చౌకగా విక్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కేంద్రం ఏప్రిల్ నుంచి బీఎస్ 6 రెండో దశ (BS 6 Phase II)ను అమలు చేయనుంది. బీఎస్ 6 2.0గా పిలిచే ఈ దశలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇంతకీ ఆర్డీఈ అంటే ఏంటి? ఈ ప్రమాణాలను కారు, బైక్ తయారీ సంస్థలు ఎందుకు పాటించాలి? వీటి వల్ల పర్యావరణం, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వీటి గురించి పూర్తి వివరాలు.
భారత్ స్టేజ్ అంటే?
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో వాయుకాలుష్యం పెరగకుండా యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో భారత్ తొలిసారి భారత్ స్టేజ్ 1 (BS-I) ప్రమాణాలను పరిచయం చేసింది. వీటిని కేంద్ర కాలుష్య నియంత్రన మండలి (CPCB) రూపొందించింది. తర్వాత వాటిని బీఎస్-II, బీఎస్ -III, బీఎస్-IVగా అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది. 2020లో కేంద్రం బీఎస్ 6 ప్రమాణాలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం వాహనాలు విడుదల చేసే కార్బన్‌డైయాక్సైడ్ (CO2), కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ఉద్గారాలు పరిమితిని దాటకూడదు. ఇందులో భాగంగా కార్ల తయారీ కంపెనీలు వాహనాలు విక్రయించే ముందు వాటిని ఉద్గారాల విడుదలను ప్రయోగశాలల్లో పరీక్షించాలి. బీఎస్ 6 ప్రమాణాలకు అనువుగా ఉంటేనే సదరు వాహనాన్ని విక్రయించాలి.
బీఎస్ 6 రెండో దశ-ఆర్డీఈ
బీఎస్ 6 రెండో దశలో ఈ ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. దీనివల్ల వాహనాలు విడుదల చేసే ఉద్గారాలు నిర్దేశిత పరిమితిని మించి ఉండకూడదు. దీంతో ఇప్పటి వరకు వాహన ఉద్గారాల పరిమితిని లేబోరేటరీలో పరీక్షించిన ఆటోమొబైల్ సంస్థలు, దాంతోపాటు ఆర్డీఈ ప్రమాణాలను తప్పక పాటించాలి. అంటే లేబోరేటరీ పరీక్షల అనంతరం కారును విక్రయించిన తర్వాత, అది విడుదల చేసే ఉద్గారాలను మరింత తగ్గించేందుకు పోర్టబుల్ ఎమిషన్స్ మెజర్మెంట్ సిస్టమ్ (PEMS)ను అన్ని వాహనాల్లో బిగించాలి. డీజిల్ వాహనాల్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (SCR) అనే డివైజ్ అదనంగా ఉండాలి. ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్‌ను ఉపయోగించి నైట్రోజెన్ ఆక్సైడ్‌లోని ఉద్గారాలను నీరుగా మార్చి విడుదల చేస్తుంది.
ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పడు కారు నడిపే వ్యక్తికి తెలియజేసేందుకు ఆన్‌బోర్డ్ సెల్ఫ్-డయాగ్నస్టిక్ డివైజ్ (OBD)ను ఆటోమొబైల్ సంస్థలు అన్ని కార్లలో ఇవ్వాలి. ఇది కర్బన ఉద్గారాల విడుదలకు సంబంధించిన సమాచారంతోపాటు, కారు నడిపే విధానంలో జరిగే మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు వంటి వాటిని పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని కారు నడిపే వ్యక్తికి తెలియజేస్తుంది. ఒకవేళ ఉద్గారాల విడుదల నిర్దిష్ట పరిమితిని దాటినట్లు గుర్తిస్తే వెంటనే సర్వీస్ చేయించమని సూచిస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్రం ఆశిస్తోంది.
డీజిల్ వాహనాల పరిస్థితేంటి?
ఆర్డీఈ ప్రమాణాల ప్రకారం కార్లను తయారు చేయడం ఆటోమొబైల్ సంస్థలకు వ్యయంతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కార్ల ధరలను తప్పక పెంచాల్సిన పరిస్థితి. దాంతో మోడల్, ఫీచర్ల ఆధారంగా కొనుగోలుదారుడు సుమారు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మెర్సిడెజ్, హ్యుందాయ్, టాటా సంస్థలు బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి.
మరోవైపు డీజిల్ కార్లలో 2.0 లీటర్ల ఇంజిన్, అంతకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలకు అధిక ధర కలిగిన ఈ డివైజ్‌లను బిగించడం ఆటోమొబైల్ సంస్థలకు గిట్టుబాటు కాదనీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పలు కంపెనీలు 2.0 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ జాబితాలో హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల కొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ మోడల్స్ కూడా ఉండటం గమనార్హం. ఏయే మోడల్స్ విక్రయాలు నిలిచిపోతాయే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతీ సుజుకీ ఆల్టో, సియాజ్,ఇగ్నిస్ - హ్యుందాయ్ ఐ20, ఐ10 నియోస్, ఆరా - మహీంద్రా అల్టురాస్ జీ4 - స్కోడా ఆక్టేవియా, సూపర్బ్ - హోండా అమేజ్, సిటీ ఐదో జనరేషన్ - రెనో క్విడ్ 800 సీసీ, టయోటా ఇన్నోవా క్రిస్టా - నిస్సాన్ కిక్స్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ద్విచక్రవాహనాల మాటేంటి?
టూవీలర్ కంపెనీలు సైతం బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇందులో భాగంగా ప్రస్తుతం బైక్‌లలో ఉపయోగిస్తున్న కార్బొరేటర్ల స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్(FIS)ను ఉపయోగించడంతోపాటు ఓబీడీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కార్బొరేటర్లతో పోలిస్తే ఎఫ్ఐఎస్ల ధర అధికం. దీంతో బైక్‌ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. తాజాగా హీరో మోటార్ ధరలను పెంచింది. ఇప్పటికే బీఎస్ 6 ప్రమాణాల కారణంగా బైక్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారేందుకు కేంద్రం గడువును పెంచక పోవడంతో పలు కంపెనీలు తమ బీఎస్ 4 మోడళ్లను తక్కువ ధరకే విక్రయించాయి. ఆ సమయంలో కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూశాయి. తాజాగా బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో క్రమంగా పెట్రోల్ ఆధారిత బైక్‌లకు డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
లైఫ్ జాకెట్ లేకుండానే 15 కి.మీ. ఈత
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!