BSNL 4G: 2022 ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 4జీ సేవల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం టీసీఎస్‌తో ఒప్పందం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 25 Mar 2023 16:10 IST

దిల్లీ: ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’తో రూ.26,281 కోట్ల ఒప్పందం చేసుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా 4జీ సేవల్ని (4G Services) ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్గం సుగమమైంది. ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కోసం టీసీఎస్‌ 4జీ లైన్లను ఏర్పాటు చేసి 9 ఏళ్ల పాటు నిర్వహించనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ వెంటనే టీసీఎస్‌కు రూ.10,000 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ ఇవ్వనుంది. దీంతో డిసెంబరు 2022 లేదా జనవరి 2023 నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవల్ని ప్రారంభించే అవకాశం ఉంది. టాటా సన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ తేజస్‌ నెట్‌వర్క్‌ స్థానికంగా 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం కావాల్సిన పరికరాలను తయారు చేయనుంది. ఆర్డర్‌ అందించిన 12 నెలల్లోపే కీలక పరికరాలను సరఫరా చేస్తామని టీసీఎస్‌ ఇటీవల తెలిపింది. రేడియో పరికరాలను అందించడానికి 24 నెలల వరకు సమయం పడుతుందని పేర్కొంది.

4జీ ప్రారంభించిన తర్వాత 5జీ సేవల్ని సైతం ప్రవేశపెట్టేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఆగస్టు నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 4జీ, 5జీ సేవలు రెండూ అందుబాటులోకి వస్తే వినియోగదారుల వలసలు తగ్గుతాయని భావిస్తోంది. తాజా రూ.26,281 కోట్ల ఒప్పందంలో భాగంగా టీసీఎస్‌ దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌- ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కోసం లక్ష టవర్లను ఏర్పాటు చేయనుంది. మరో 25 వేల టవర్లను వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని