BSNL: బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త సంవత్సరం ఆఫర్‌

డీఎస్‌ఎల్‌ కనెక్షన్లను ఫైబర్‌ నెట్‌లోకి మార్చడంలో భాగంగా BSNL కొత్త సంవత్సరం ఆఫర్‌ను తీసుకొచ్చింది.

Published : 27 Dec 2022 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ‘భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌- (BSNL)’ తమ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం కొత్త సంవత్సరం ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం ఇప్పటికే ఉన్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ అందిస్తున్న ఫైబర్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ను మరింత విస్తరించడంలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల్లో అత్యధిక మంది ‘డిజిటల్‌ సబ్‌స్క్రైబర్‌ లైన్‌ (DSL)’ కనెక్షన్‌ ఉన్నవారే. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ, డీఎస్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లు కొత్త సర్వీసుకి మారడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో డీఎస్‌ఎల్‌ కనెక్షన్లను ఫైబర్‌ నెట్‌లోకి మార్చడంలో భాగంగానే ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఆఫర్‌ ఏంటి?

బీఎస్‌ఎన్‌ఎల్‌ డీఎస్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు భారత్‌ ఫైబర్‌ సర్వీసెస్‌లోకి మారితే ప్రత్యేక రాయితీలు పొందొచ్చు. సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఆరు నెలల వరకు రూ.200 తగ్గింపు లభిస్తుంది. ఓటీటీ ప్రయోజనాలతో పాటు 300 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను ఆస్వాదించొచ్చు. రూ.275తో బేస్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే డీఎస్‌ఎల్‌ కస్టమర్లు ఏటా చెల్లించే బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ బిల్లులో 12,00 వరకు తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది.

వాస్తవానికి బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రమంగా తన పట్టును కోల్పోతోంది. జియో, ఎయిర్‌టెల్‌తో పోటీలో ఇది వెనుకబడిపోతోంది. వైర్‌లైన్‌ సెగ్మెంట్‌ మొత్తంలోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ పట్టు సడలుతోంది. ఇటీవలి కాలం వరకు ఇది తొలిస్థానంలో ఉండగా.. ఇప్పుడు జియో ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఎయిర్‌టెల్‌ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థను అధిగమించే స్థాయికి చేరుకుంది. నిధుల కొరతతో సతమతమవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌... ఇటీవల బీబీఎన్‌ఎల్‌ (BBNL) ద్వారా ఫైబర్‌ సేవల విస్తరణను చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని