BSNL 5G: వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు

వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు ప్రారంభమవుతాయని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Published : 01 Oct 2022 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ శకం ఆరంభమైంది. ప్రధాని మోదీ చేతుల ఇవాళ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా 5జీ సేవల విస్తరణపై ఎయిర్‌టెల్‌, జియో తమ ప్రణాళికను వెల్లడించాయి. దీంతో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ అయిన BSNL 5జీ సర్వీసులు ఎప్పుడు తీసుకొస్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టతనిచ్చారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో భాగంగా ఆయన విలేకరులతో దీనిపై మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.

‘‘రాబోయే ఆరు నెలల్లో దేశంలోని 200కు పైగా నగరాల్లో 5జీ సేవలు ఆరంభం కాబోతున్నాయి. రెండేళ్లలో దేశంలోని 80-90 శాతం ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి BSNL సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తక్కువ ధరకే ఈ సేవలు లభిస్తాయి’’ అని వైష్ణవ్‌ చెప్పారు. అయితే, ఇప్పటికీ దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సేవలు విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

  • మరోవైపు దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌ నాటికి 5జీ సేవలు తీసుకొస్తామని జియో ప్రకటించింది. తక్కువ ధరకే ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. తొలుత దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో దీపావళి నాటికి 5జీ సేవలను తెస్తామని ఇది వరకే జియో ప్రకటించింది.
  • నేటి నుంచే (అక్టోబర్‌ 1) 8 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 5జీ సేవలను ప్రారంభించిన తొలి కంపెనీ తమదేనని తెలిపింది. 2023 మార్చి నాటికి అన్ని నగరాల్లో 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను తీసుకొస్తామని ఆ కంపెనీ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తెలిపారు. 4జీ ధరలకే ప్రస్తుతం 5జీ సేవలు అందిస్తామని, త్వరలో 5జీకి సంబంధించిన టారిఫ్‌లను ప్రకటిస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దిల్లీ, ముంబయి, వారణాశి, బెంగళూరు సహా 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
  • 5జీ సేవల కోసం సిమ్‌కార్డును మార్చాల్సిన అవసరం లేదని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. 5జీ మొబైల్‌ ఉంటే సరిపోతుందని పేర్కొంటున్నాయి. ఒకవేళ మీరున్న ఏరియాలో నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చి, మీ ఫోన్‌ 5జీకి సపోర్ట్‌ చేస్తే వేగవంతమైన డేటా సేవలను ఆనందించొచ్చని అంటున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని