పైసా ఆదాయం లేకుండా ట్రేడింగ్‌.. ₹26 లక్షలు పోగొట్టుకున్న బీటెక్‌ విద్యార్థి!

FandO trading: ట్రేడింగ్‌ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చంటూ సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనల్ని చూసి ట్రేడింగ్‌కు బానిసయ్యాడు ఓ స్టూడెంట్‌. దీంతో ఏకంగా రూ.26 లక్షలు పోగొట్టుకున్నాడు.

Published : 25 Jun 2024 16:48 IST

FandO trading | ఇంటర్నెట్‌డెస్క్‌: స్టాక్‌మార్కెట్‌ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా ట్రేడింగ్‌ల్లో పాల్గొనడం.. వాట్సప్‌, టెలిగ్రాం గ్రూపుల్లో జాయిన్‌ అయి డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి సంపాదించిందంతా పోగొట్టుకోవడం..  ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న సంఘటనలు. సమగ్ర అవగాహన ఉంటేనే ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడ్‌ చేయాలని, లేకపోతే దానికి దూరంగా ఉండాలని ఓవైపు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేస్తున్నా.. కొందరు మాత్రం ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా అదే వలలో చిక్కుకున్నాడు ఓ బీటెక్‌ విద్యార్థి. తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్‌ ఫైల్‌ని చూసి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం రావడంతో చాలామంది ఐటీఆర్‌లు ఫైల్‌ చేయడం మొదలుపెట్టారు. అలా తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్‌ ఫైల్‌ని చూసి సీఏ రోషన్ అగర్వాల్ అవాక్కయ్యారు. ట్రేడింగ్‌లో అతడు ఏకంగా రూ.26 లక్షలు నష్టం వచ్చినట్లు అందులో పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయారు. ఏ ఉద్యోగమూ చేయకుండానే.. మూడో సంవత్సరం చదువుతున్న ఆ బీటెక్‌ విద్యార్థికి ట్రేడింగ్‌ చేయడానికి ఇంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.

‘‘బీటెక్‌ చదువుతున్న ఆ స్టూడెంట్‌కు ఎటువంటి ఆదాయం లేదు. పేరెంట్స్‌ విడిపోయారు. తల్లి హోటల్‌ నడుపుతోంది. యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ల అకౌంట్‌ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఇలా డబ్బుతో ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ట్రేడింగ్‌లో రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్‌అండ్‌ఓ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’’ అని ఆ సీఏ పేర్కొన్నారు.

ఇండెక్సేషన్‌ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?

‘‘తన స్నేహితుడు ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని.. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులు, సోషల్‌ మీడియా ద్వారా ట్రేడింగ్‌ గురించి తెలుసుకున్నాడు. తర్వాత దానికి బానిసయ్యాడు. గతేడాదిలో రిటర్నులు ఫైల్‌ చేయడానికి వచ్చినప్పుడే ట్రేడింగ్‌ మానేయాలని నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించా. అయినా ఫలితం లేకపోయింది. ఎందుకు మానలేకపోతున్నావని ప్రశ్నిస్తే.. ట్రేడింగ్‌కు బానిసైపోయా అని సమాధానమిచ్చాడు’’ అని అగర్వాల్‌ చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం ఇకపై ట్రేడింగ్‌ చేయనని మాటిచ్చాడంటూ ఆనందం వ్యక్తంచేశారు. సులువుగా డబ్బు సంపాదించొచ్చు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చంటూ సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని సీఏ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని