Budget 2023: కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులొద్దు.. బడ్జెట్‌పై జీటీఆర్‌ఐ సూచనలు

Budget 2023: దేశీయంగా తయారీని ప్రోత్సహించడం కోసం బడ్జెట్‌లో తీసుకోవాల్సిన చర్యలపై జీటీఆర్‌ఐ తమ ప్రతిపాదనలకు కేంద్రానికి నివేదించింది. 

Published : 26 Jan 2023 20:27 IST

దిల్లీ: దేశంలో తయారీని ప్రోత్సహించడానికి వచ్చే ఐదేళ్ల పాటు కస్టమ్స్‌ సుంకాల్లో (Customs Duty) ఎలాంటి మార్పు చేయొద్దని ఆర్థిక మేధోసంస్థ ‘గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (GTRI)’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కీలక పరికరాలపై దిగుమతి పన్నును కొనసాగించాలని సూచించింది. ‘ఇన్వర్టెడ్‌ డ్యూటీ’ విషయంలో స్పష్టతనివ్వాలని కోరింది. కస్టమ్స్‌ సుంకం (Customs Duty)లో నెలకొన్న గందరగోళం, చిక్కులను నివారించేందుకు శ్లాబులను 25 నుంచి ఐదుకు కుదించాలని సూచించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమ అభిప్రాయాలు, డిమాండ్లను జీటీఆర్‌ఐ ప్రభుత్వానికి నివేదించింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లను భారత్‌ సమర్థంగా ఎదుర్కొనేందుకు పై సూచనలు ఉపయోగపడతాయని జీటీఆర్‌ఐ తెలిపింది. కస్టమ్స్‌ సుంకం (Customs Duty)లో మార్పులు చేస్తే ఆ ప్రభావం ‘ఉత్పత్తి అనుసంధానిత పథకం (PLI)’పై ఉంటుందని పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు దశలవారీగా అమలు చేస్తున్న పథకాలపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే కచ్చితమైన అవసరం ఉంటే తప్ప దిగుమతి సుంకాలను తగ్గించొద్దని సూచించింది. సుంకాల్లో ఎలాంటి మార్పు లేకపోవడం.. ఆర్థిక విధానాల్లో స్థిరత్వాన్ని సూచిస్తుందని హితవు పలికింది.

ఎలక్ట్రానిక్‌, భారీ ఇంజినీరింగ్‌ యంత్రాల్లో వేలాది చిన్న చిన్న పరికరాలు ఉంటాయని జీటీఆర్‌ఐ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో వాటి దిగుమతిపై సుంకాన్ని స్థిరంగా కొనసాగిస్తే దేశీయంగా తయారీకి బాటలు పడతాయని సూచించింది. ఒకవేళ ఈ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తే వాటన్నింటినీ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయని తెలిపింది. అప్పుడు భారత్‌ కేవలం అసెంబ్లింగ్‌కు మాత్రమే కేంద్రంగా మారుతుందని పేర్కొంది. ఫలితంగా దేశీయ తయారీ లక్ష్యం గాడి తప్పుతుందని అభిప్రాయపడింది.

0- 150 శాతం పన్ను రేటుతో కస్టమ్స్‌ సుంకం (Customs Duty)లో ప్రస్తుతం 26 శ్లాబులు ఉన్నాయని జీటీఆర్‌ఐ గుర్తుచేసింది. దీనికి అదనంగా మరో 100 ప్రత్యేక, మిశ్రమ-డ్యూటీ శ్లాబులు ఉన్నాయని తెలిపింది. ఇలా ఎక్కువ శ్లాబుల వల్ల ఒకే తరహా వస్తువులకు వివిధ సుంకాలను వర్తింపజేయాల్సి వస్తోందని పేర్కొంది. దీనివల్ల వస్తువుల వర్గీకరణలో వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపింది. అలాగే ఆటోమేటెడ్‌ డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను సైతం కష్టతరం చేస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో సుంకాల శ్లాబులను ఐదుకు కుదించాలని సూచించింది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు