Budget 2023: బడ్జెట్‌లో ఆరోగ్యం.. ‘సికిల్‌ సెల్‌ ఎనీమియా’ నిర్మూలనే లక్ష్యం!

గతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో (Budget 2023) ఆరోగ్య రంగానికి 13శాతం నిధులు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో 2047 నాటికి ‘సికిల్‌ సెల్‌ ఎనీమియా (Sickle Cell Anaemia) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు తెలిపింది.

Published : 01 Feb 2023 21:37 IST

దిల్లీ: గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ 2023-24లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది (2022-23) రూ.79వేల కోట్లు కేటాయించగా తాజాగా వాటిని రూ.89వేలకు (13శాతం) పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 2047 నాటికి సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు నెలకొల్పామని.. వీటికి అనుబంధంగా కొత్తగా 157 నర్సింగ్‌ కళాశాలలను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రధానమంత్రి స్వస్త్య సురక్షా యోజన (PMSSY)ను రెండు భాగాలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో పీఎంఎస్‌ఎస్‌ఐ అలాగే ఉండగా.. 22 కొత్త ఎయిమ్స్‌ల ఏర్పాటు కోసం రూ.6,835 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు తెలిపింది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.29వేల కోట్లు.. ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (PM-JAY)కు రూ.7200 కోట్లు కేటాయించామని పేర్కొంది. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌కు రూ.341 కోట్లు, నేషనల్‌ టెలీ మెంటల్‌ హెల్త్‌ కార్యక్రమం కోసం రూ.133కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.

సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలకు మిషన్‌..

‘సికిల్‌ సెల్‌ ఎనీమియా (Sickle Cell Anaemia) వ్యాధిని 2047 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. అవగాహన పెంచడం, వ్యాధి తీవ్రత ఉన్న మారుమూల ప్రాంతాల్లోని 0-40 ఏళ్ల మధ్య వయసున్న 7కోట్ల మందికి పరీక్షలు నిర్వహించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం వంటి చర్యలు చేపడతాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

ఏమిటీ సికిల్‌ సెల్‌ ఎనీమియా..?

సికిల్‌ సెల్‌ ఎనీమియా అనేది జన్యుపరమైన సమస్య. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌, పోషకాలను చేరవేసే ఎర్ర రక్తకణాలను ఇది దెబ్బతీస్తుంది. ఈ జబ్బు బారిన పడిన బాధితుల్లో ఎర్రరక్త కణాలు కొడవలి (సికిల్‌) లేదా నెలవంక రూపంలోకి మారిపోవడంతోపాటు జిగురుగానూ, గట్టిగానూ తయారవుతాయి. ఫలితంగా సరిగ్గా కదల్లేక సూక్ష్మ రక్తనాళాల్లో చిక్కుకుపోవటం ఆరంభిస్తాయి. దీంతో రక్త సరఫరా నెమ్మదించడంతో కణాలకు తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందక తీవ్రమైన నొప్పి, రక్తహీనత, ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యలు మొదలవుతాయి.

సికిల్‌ సెల్‌ ఎనీమియా జీవితాంతం వెంటాడే సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది దీంతో పుడుతున్నారని అంచనా. వీరిలో సగం మంది ఐదేళ్లలోపే మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సికిల్‌ సెల్‌ ఎనీమియా జబ్బు కారక జన్యువు గలవారిలో 50 శాతానికి పైగా మంది భారత్‌కు చెందినవారే. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం.. సికిల్‌ సెల్‌ ఎనీమియా జబ్బుతో పుట్టిన పిల్లల్లో 20% మంది రెండేళ్లలోపే మరణిస్తున్నారు. అంతేకాదు, 30% మంది 20 ఏళ్లకు ముందే (గిరిజనుల్లో) చనిపోతున్నారు.

లక్షణాలు.. నిర్ధారణ

సికిల్‌ సెల్‌ ఎనీమియా చాలావరకు చిన్న వయసులోనే బయటపడుతుంది. లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. రక్త హీనత, ఛాతీ, కడుపు, కీళ్లలో తరచుగా నొప్పులు, కాళ్లు, చేతుల వాపు, ఎదుగుదల కుంటుపడటం, చూపు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్‌ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. వంశపారంపర్యంగా సంభవించే ఈ వ్యాధికి ఆర్థికంగా వెనకబడిన.. ముఖ్యంగా గిరిజన తెగలవారే ఎక్కువగా బలైపోతున్నారు. త్వరితగతిన గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ జబ్బును చాలావరకు నివారించుకోవచ్చని.. ఇందుకు జన్యు కౌన్సెలింగ్‌ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు