Budget 2022: వన్‌ నేషన్‌-వన్‌ రిజిస్ట్రేషన్‌.. లక్ష కోట్లతో రాష్ట్రాలకు నిధి!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో భారీ పథకాల జోలికి వెళ్లనప్పటికీ.. అన్ని రంగాలకు ఊతం కల్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Updated : 01 Feb 2022 17:59 IST

ఆచితూచి అడుగులు వేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో భారీ పథకాల జోలికి వెళ్లనప్పటికీ.. అన్ని రంగాలకు ఊతం కల్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు రంగాల్లో సంస్కరణలే లక్ష్యంగా ఆర్థిక మంత్రి అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని రంగాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచే ఆత్మనిర్భర్‌ భారత్‌కు పెద్దపీట వేస్తూనే సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తాజా బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోంది. అయితే, కొవిడ్‌ దెబ్బతో ఒడిదొడుగులకు గురైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడంపై దృష్టి పెడుతూనే రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ఎటువంటి ప్రకటన ఈ బడ్జెట్‌లో లేకపోవడం గమనార్హం.

వన్‌ నేషన్‌.. వన్‌ రిజిస్ట్రేషన్‌..

భూ సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్ల కోసం ఆధునిక వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకాన్ని (NGDRS) తీసుకురానున్నట్లు తెలిపింది. తద్వారా దేశంలో ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే నూతన వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

లక్ష కోట్లతో రాష్ట్రాలకు నిధి..

రాష్ట్రాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఈసారి బడ్జెట్‌లో కేంద్రం ప్రత్యేక కేటాయింపులు జరిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు 50ఏళ్లకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపింది. రాష్ట్రాల రుణ పరిమితులకు అదనంగా ఈ ఆర్థిక సహాయం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ రుణాలను పీఎం గతిశక్తి, ఉత్పాదక మూలధన వ్యయాలకు ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వీటితోపాటు మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు సహాయం చేస్తామని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపింది.

పట్టణ ప్రణాళికలకు ప్రాధాన్యం..

నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళికలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నిర్మాణ రంగంలో సంస్కరణలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్‌ రూపొందిస్తోంది. ఇందుకోసం 5 విద్యా సంస్థలకు పట్టణ ప్రణాళిక సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటికి రూ.250 కోట్ల కేటాయింపులు జరిపినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

ఎంఎస్‌ఎంఈలకు ఊతం

రానున్న ఐదేళ్ల కాలంలో ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటి రేటింగ్‌ కోసం రూ.6వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా Udyam, e-shram, NCS, Aseem పోర్టల్స్‌ను అనుసంధానించి వాటి సేవలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో భాగంగా అంకుర సంస్థలను (స్టార్టప్‌లను) ప్రోత్సహించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే స్టార్టప్‌ రంగంలో ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌లు రూ.5.5లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సూచనలు ఇచ్చేందుకు గానూ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్టార్టప్‌లకు మూడేళ్లుగా పన్ను రాయితీలను ఇస్తుండగా.. వాటిని మరో ఏడాది పెంచుతున్నామని వెల్లడించింది.

నూనెగింజల ఉత్పత్తిపై శ్రద్ధ

కొవిడ్‌ విజృంభణ సమయంలో దేశవ్యాప్తంగా నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు నూనెగింజల దిగుమతిపైనే ఆధారపడడంతో ఆ పరిస్థితి తలెత్తినట్లు నిపుణులు అంచనా వేశారు. అందుకే వాటి దిగుమతులపై ఆధారపడడం తగ్గించి అటువంటి సమస్యను అధిగమించేందుకు దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఓ పథకాన్ని తేనున్నట్లు తాజా బడ్జెట్‌లో వెల్లడించింది.

చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు..

దేశవ్యాప్తంగా పాస్‌పోర్టుల జారీ నూతన విధానాన్ని అనుసరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2022-2023 నుంచి ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికతను వినియోగించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులను జారీచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

కాంట్రాక్టర్లకు ఈ-బిల్లుల సౌకర్యం

కాంట్రాక్టర్ల కోసం ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కలిపించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం కలుగుతుంది.

కిసాన్‌ డ్రోన్లు..

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా భూ రికార్డుల డిజిటలీకరణ, పంటల అంచనా, పురుగుమందుల పిచికారీ కోసం డ్రోన్లను విరివిగా ఉపయోగించేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం పలు ప్రోత్సాహకాలను అందిచనున్నట్లు తాజాగా బడ్జెట్‌లో పేర్కొంది.

బడ్జెట్‌లో మరిన్ని విశేషాలు..

* బొగ్గుద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం నాలుగు పైలట్‌ ప్రాజెక్టులు

* దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీ ప్రోత్సాహకానికి రూ.19,500 కోట్లు కేటాయింపు

* ఎంఎస్‌ఎంఈల రేటింగ్‌కు రూ.6వేల కోట్లతో ప్రత్యేక పథకం

* దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు

* దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం

* గంగా పరివాహం వెంబడి నేచురల్‌ ఫార్మింగ్‌ కారిడార్‌

* మహిళలు, చిన్నారుల అభివృద్ధికి మూడు ప్రత్యేక పథకాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని