Budget: ఉద్యోగ కల్పనపై బడ్జెట్‌లో దృష్టి పెట్టాలి.. పరిశ్రమ వర్గాల సూచన

వచ్చే ఏడాది బడ్జెట్‌కు సంబంధించిన ముందస్తు సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి తమ సూచనలను అందజేస్తున్నాయి. ఈసారి ఉద్యోగ సృష్టిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

Published : 21 Nov 2022 19:04 IST

దిల్లీ: ఉద్యోగ కల్పన, పన్ను వసూళ్లను పెంచడం వంటి చర్యలపై బడ్జెట్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీ, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ ద్వారా పన్ను వసూళ్లు పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. ఫలితంగా వినియోగం పెరిగేందుకు దోహదం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం జరిగిన ముందస్తు బడ్జెట్‌ సమావేశాల్లో సూచించాయి. 

దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని ‘భారత పరిశ్రమల సమాఖ్య (CII)’ అధ్యక్షుడు సంజీవ్‌ బజాజ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ అంశాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ కల్పనను పెంచడం, ఫలితంగా వినియోగం పుంజుకొని వృద్ధి ఊపందుకుంటుందని వివరించారు. ఉద్యోగ సృష్టి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉద్యోగ ఆధారిత రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టాలని సీఐఐ సూచించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలిపింది. ఈ బడ్జెట్‌లోనే దానికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రతిపాదించాలని కోరింది. 

మరోవైపు ప్రస్తుత కార్పొరేట్‌ పన్నులను అలాగే కొనసాగిస్తూ వ్యాపారాలకు దన్నుగా నిలవాలని బజాజ్‌ సూచించారు. మరోవైపు పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను వివాద పరిష్కారాలను సైతం తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు పీహెచ్‌డీసీసీఐ సైతం తమ ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రి ముందు ఉంచింది. వినియోగాన్ని ప్రోత్సహించడం, ఫ్యాక్టరీల సామర్థ్యాల్ని పెంచడం, ఉద్యోగ సృష్టి, మౌలిక వసతుల నాణ్యతను పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడుల్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పీహెచ్‌డీసీసీఐ సూచించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో దేశీయంగా వృద్ధికి ఊతమిచ్చే రంగాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని హితవు పలికింది.

25న ఆర్థిక మంత్రులతో సమావేశం

ముందస్తు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఈ నెల 25న శుక్రవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 22న వ్యవసాయం, వ్యవసాయ శుద్ధిరంగం, ఆర్థిక రంగం, స్టాక్‌ మార్కెట్లు; 24న సేవలు, వాణిజ్యం, సామాజిక రంగాలైన ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్య రంగాల వారితో; 28న కార్మిక సంఘాలు, ఆర్థిక నిపుణులతో సమావేశం కానున్నారు. ఉదయం, సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని