Emergency Fund: అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?

అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.

Published : 10 Jul 2024 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఒక్కరూ తమ ఉపాధి ద్వారా పొందే ఆదాయంతో దైనందిన జీవితాన్ని గడుపుతారు. కొన్నిసార్లు అనుకున్నవి అన్నీ సక్రమంగా జరగకపోవచ్చు. వ్యక్తిగత అనారోగ్యం వల్ల గానీ, పనిజేసే సంస్థ సరిగ్గా నడవకపోవడం వల్ల గానీ ఉపాధి కోల్పోవచ్చు. అటువంటప్పుడు 3-6 నెలలు మళ్లీ ఉపాధి వెతుక్కోవడానికి సమయం పట్టొచ్చు. ఇటువంటప్పుడు ఆ వ్యక్తిని, కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడడానికి అత్యవసర నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ సమకూర్చుకోవాలి. తక్కువ స్థాయి ఆదాయ వర్గాల వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ అత్యవసర నిధిని సమకూర్చుకోవడం ఒక సవాలే. ఈ నిధిని సమకూర్చుకోవడానికి ఎలాంటి విషయాల్లో శ్రద్ధ వహించాలో ఇక్కడ తెలుసుకుందాం.

అత్యవసర నిధి

ఎవరికైనా వారి జీవితంలో అత్యవసర పరిస్థితులు అనుకోకుండా వస్తాయి. నేటి అస్థిర ప్రపంచంలో ఉపాధి ఎప్పడైనా కోల్పోవచ్చు. లేదా అనుకోకుండా కుటుంబ ఖర్చులు పెరిగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తమ రోజువారీ జీవన వ్యయానికి ఇబ్బందిలేకుండా గడవడానికి అత్యవసర నిధి ఉండడం చాలా అవసరం. అందుకని మీ ఆదాయం ఎంతైనా సరే, అత్యవసర నిధిని సమకూర్చుకోవడానికి మీ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా కేటాయించాలి. ఈ అత్యవసర నిధిలో కనీసం 6 నెలల పాటు కుటుంబ ఖర్చులు, ఈఎంఐలతో సహా కవరయ్యేలా ఉండాలి. ఈ నిధి సంక్షోభ సమయాల్లో ఆర్థిక భద్రతనిస్తుంది. కొంత కాలం పాటు స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా ఉండేలా ఉపయోగపడుతుంది. 

నిధిని సమకూర్చుకోవడం

భారత్‌లో ఇప్పటికీ చాలా కుటుంబాలు అత్యవసర నిధిని సమకూర్చుకోవడం లేదు. కొంత మంది సమకూర్చుకున్నా అందులో నిల్వను వేరే అవసరాలకు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఆ నిధిని సరిగ్గా నిర్వహించలేక పోతుంటారు. ఎవరైనా ఒక నిధిని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్నీ నిరంతరం పెంపొందించుకోవడం చాలా అవసరం. నిధిలో కొంత భాగాన్ని ఉపయోగించినట్లయితే, ఆ నిధిని కవర్‌ చేయడానికి క్రమం తప్పకుండా సహకారం అందించాలి. ఖర్చుల విషయంలో ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఈ నిధిని కవర్‌ చేయొచ్చో కూడా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి

చాలా మంది రోజువారీ ఖర్చుల్లో అవసరమున్నా లేకపోయినా లగ్జరీ ఉత్పత్తులను వాడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఉదాహరణకు సువాసన ఇచ్చే కొవ్వొత్తులు, డిజైన్‌తో కూడిన సబ్బులు, ఇంకా అనేక వినియోగించే వస్తువులు, గృహోపరకరణాలను వాడుతుంటారు. ఇంకా తరచు బయట తినడం, అవసరం లేని సందర్భాల్లో కూడా ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసి ధరించడం మొదలైనవి. ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉన్నవారు అత్యవసర నిధిని సమకూర్చుకునేటప్పడు ఇలాంటి అన్నీ అధిక ఖర్చులు వెంటనే మానుకోవడం మేలు. ఇంకా వీరు సొంత వాహనాన్ని ఉపయోగించే బదులు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించొచ్చు. ఇంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల వైద్య ఖర్చులు తగ్గించుకోవచ్చు.

వ్యాయామం చేయడానికి ఖరీదైన జిమ్‌ సభ్యత్వాన్ని తీసుకునే బదులు ఇంటిలో కూడా తగిన వ్యాయామం చేయొచ్చు. అదేవిధంగా మీరు వీక్షించని ఛానెల్స్‌ లేదా స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్స్‌ కోసం సైన్‌ అప్‌ చేసి ఉండొచ్చు. ఇలాంటి వాటి వినియోగం గురించి మరింత జాగ్రత్తగా ఉండడం వల్ల మీ యుటిలిటీ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అవసరం లేకపోయినా ఇంటిలో అందరూ స్మార్ట్‌ఫోన్స్‌ వాడేస్తున్నారు. చదువుకునే పిల్లలకు నెట్‌వర్క్‌ సబ్‌స్క్రిప్షన్‌ రద్దు చేయడం మేలు. ముఖ్యంగా ఇంటి వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంటిలో సంపాదించే వ్యక్తి స్వయంగా మార్కెట్‌కు వెళ్లడం వల్ల ఖర్చులు చాలావరకు తగ్గుతాయి. సాధారణంగా సంపాదించే వ్యక్తి అనవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. ఖర్చు చేసిన తర్వాత క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ఇచ్చే బదులు జేబు నుంచి నగదు ఇవ్వడం మేలు. దీనివల్ల కూడా అధికంగా ఖర్చుపెట్టడానికి ఇష్టపడరు. ఇలాంటి పొదుపు అలవాట్ల ద్వారా అత్యవసర నిధికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

బోనస్‌, బీమా

అనేక సంస్థలు కార్మికులకు అదనపు గంటలకు భత్యాన్ని అదనంగా ఇస్తాయి. కొన్ని సంస్థలు త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన బోనస్‌లు ఇస్తాయి. కొన్నిసార్లు వారి ప్రాజెక్ట్‌ ఓవర్‌ పెర్ఫార్మెన్స్‌ చేసినప్పుడు కూడా అదనపు జీతం పొందుతారు. ఇలాంటి అదనపు ఆదాయాలను అత్యవసర నిధిలో ఉండేలా చర్యలు తీసుకోవచ్చు. ఇంకా మీ అత్యవసర నిధికి పన్ను వాపసుల వంటి ఏక మొత్తాలను తిరిగి కేటాయించండి. చాలా మంది బీమా పాలసీలను తీసుకుంటున్నారు. బీమాను తీసుకునేటప్పుడు అధిక ప్రీమియం ఉండే ఎండోమెంట్‌ పాలసీకి బదులుగా జీవిత బీమా అధికంగా కవరయ్యే టర్మ్‌ పాలసీ తీసుకోవడం మేలు. దీనికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ప్రీమియం ఖర్చులు తగ్గడం వల్ల మిగులు నిధులను అత్యవసర నిధికి తరలించొచ్చు.

ఖర్చులు వాయిదా

అత్యవసర నిధి కోసం పొదుపు చేసేటప్పుడు కొన్ని ఖర్చులను వాయిదా వేయాల్సి ఉంటుంది. విహారయాత్రకు వెళ్లడం, ఖరీదైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేయడం, ఇల్లు రీమోడల్‌ చేయించడం.. ఇంకా ఏదైనా ఇతర స్వల్పకాలిక లక్ష్యానికి సంబంధించిన ఖర్చులున్నప్పుడు వాటిని వాయిదా వేసి, మొదటగా అత్యవసర నిధిని సమకూర్చుకోవడానికి మొగ్గు చూపడం మేలు.

అదనపు సంపాదన

అధిక ఆదాయం గలవారికి ధనం గురించి పెద్దగా బెంగ ఉండకపోవచ్చు. కానీ, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలవారికి రెగ్యులర్‌ ఆదాయంతో పాటు అదనపు ఆదాయం ఉండడం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. పరిస్థితులు బాగా లేనప్పుడు సంపాదించిన ఈ అదనపు ఆదాయమే వారిని ఆర్థికంగా కాపాడుతుంది. ఈ ఆదాయం కోసం ఖాళీగా ఉన్న గంటల్లో వీరు పార్ట్‌-టైం ఉద్యోగాన్ని చేయొచ్చు. ఫ్రీలాన్స్‌ అసైన్‌మెంట్స్‌ను చేపట్టవచ్చు. లేదా ఇంటి నుంచి పని చేయొచ్చు. మీ పరిసర ప్రాంతాల్లో పిల్లలకు ప్రైవేట్‌గా పాఠాలు చెప్పవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా వచ్చే డబ్బులతో అత్యవసర నిధిని నిర్మించవచ్చు.

పాత వస్తువులను అమ్మేయండి..

మీకు అవసరం లేని, ఉపయోగించని అనేక వస్తువులు ఇంట్లో ఉండొచ్చు. వాటిని అలాగే ఉంచడం వల్ల ఇంటిలో అసౌకర్యంగా ఉంటుంది. ఇంటిలో స్థలం కూడా సరిపోదు. అలాంటి వాటిని ఆన్‌లైన్‌లో తిరిగి విక్రయించడానికి ప్రయత్నించొచ్చు. కొన్ని పాత వస్తువుల విక్రయానికి ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఉంది. Marketplace వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సాధారణ ధరలకు వీటి విక్రయానికి వీలుంటుంది. ఇలా వచ్చే నిధులను అత్యవసర నిధికి బదిలీ చేయొచ్చు.

ఖర్చులు పర్యవేక్షించండి

ఇంటి బడ్జెట్‌ ప్రభావవంతగా ఉండాలంటే.. ఆదాయం, ఖర్చులను పర్యవేక్షించాలి. అన్ని రాబడులు, ఖర్చులను నిశితంగా ట్రాక్‌ చేయడం చాలా అవసరం. ప్రతి నెలా బడ్జెట్‌లో అధిక వ్యయాన్ని నిరోధించడానికి ఈ పద్ధతి చాలా కీలకం. నెలాఖరులో ఏదైనా మిగులు నిల్వ ఉన్నప్పుడు ఈ పొదుపును అత్యవసర నిధికి బదిలీ చేయాలి. ఇంకా ఒక నెలపాటు అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండడానికి మీరు కొన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణ పాటించండి. ఈ విధానం మీ అత్యవసర నిధిని వేగంగా భర్తీ చేయడానికి సమర్థమైన పద్ధతిగా ఉపయోగపడుతుంది.

చివరిగా: అత్యవసర నిధిని కలిగి ఉండడం ద్వారా.. మీరు స్వల్పకాల ఖర్చులకు కూడా అప్పులు చేయకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా.. ఊహించని ఖర్చులను నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని