Updated : 26 Feb 2022 15:27 IST

Health Insurance: యువ‌త ఆరోగ్య బీమా ఎందుకు కొనుగోలు చేయాలి?

రోజూ ఉద‌యాన్నే లేస్తున్నాను, జిమ్ చేస్తున్నాను, చాలా ఫిట్‌గా ఉన్నాను, పైగా వ‌య‌సు కూడా త‌క్కువే. ఇంకా ఆరోగ్య బీమా అవ‌స‌రం ఏముంది?యుక్త వ‌య‌సులో ఉన్న వారిని ఆరోగ్య బీమా తీసుకోమ‌ని సూచిస్తే.. బ‌దులుగా వారు అడిగే ప్ర‌శ్న ఇది. నిజ‌మే, చిన్న వ‌య‌సులో ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవకాశం త‌క్కువే, కానీ పూర్తిగా ఉండ‌వ‌ని చెప్ప‌లేము. ప్ర‌స్తుతం ఉన్న జీవ‌న‌శైలిలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎవ్వ‌రైనా, ఎప్పుడైనా అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ప‌ని ఒత్తిడి, జీవ‌న‌శైలి మార్పులు, నిద్ర వేళ‌లు స‌రిగ్గా లేక‌పోవ‌డం, ఎల‌క్ట్రానిక్ వస్తువుల వాడ‌కం ఎక్కువ‌వ‌డం, కాలుష్యం, ఇలా ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. పైగా వీటికి తోడు కోవిడ్‌-19 వంటి కొత్త వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ, మాన‌వాళిని ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. 

మ‌రోవైపు వైద్య ఖ‌ర్చులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏ కార‌ణం చేత‌నైనా అనారోగ్యం బారిన ప‌డి ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే అందుకు అయ్యే ఖ‌ర్చులను ఆరోగ్య బీమా స‌హాయం లేకుండా భ‌రించ‌డం సామాన్యుడికి క‌ష్ట‌మే. సాధార‌ణంగా వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న‌వారు అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ కాబ‌ట్టి 40 ఏళ్లు దాటిన త‌ర్వాత ఆరోగ్య బీమా కొనుగోలు చేసేందుకు ప్రాధాన్య‌త ఇస్తారు. కానీ, యుక్త వ‌య‌సులో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ముందు నుంచే వైద్య ఖ‌ర్చుల గురించి చింత లేకుండా జీవించ‌డంతో పాటు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

వెయిటింగ్ పీరియడ్..
ఆరోగ్య బీమాను తీసుకున్న వెంట‌నే పాలసీ వ‌ర్తించ‌దు. కొంత నిరీక్ష‌ణ కాలం ఉంటుంది. ఇది మీరు ఎంచుకున్న పాల‌సీ, బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. వెయింటింగ్ పిరియ‌డ్‌లో ఉన్న‌ప్పుడు ముందుగా ఉన్న అనారోగ్యాలు, నిర్దిష్ట వ్యాధుల‌కు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను బీమా సంస్థ‌లు అంగీకరించ‌వు. వినియోగ‌దారుడు పాల‌సీ ద‌ర‌ఖాస్తు చేసుకున్న నాటికి 48 నెల‌ల ముందు వ‌ర‌కు నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌కు వెయిటింగ్ పీరియ‌డ్‌ వ‌ర్తిస్తుంది. సాధార‌ణంగా చాలా వ‌ర‌కు పాల‌సీల‌కు 30 నుంచి 90 రోజుల వ‌ర‌కు నిరీక్ష‌ణ కాలం ఉంటుంది. మీరు ఎంచుకున్న బీమా సంస్థ‌, పాల‌సీ ఆధారంగా 4 సంత్స‌రాల వ‌ర‌కు కూడా వెయిటింగ్ పీరియ‌డ్‌ ఉండొచ్చు. వ‌య‌సు పెరిగే కొద్ది నిరీక్ష‌ణా కాలం ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమా తీసుకుంటే క్లెయిమ్ అవ‌స‌ర‌మ‌య్యే స‌మ‌యానికి మీ పాల‌సీ వెయిటింగ్ పిరియ‌డ్‌ను దాటిపోయే అవ‌కాశం ఉంటుంది. 

సమగ్ర బీమా..
చిన్నతనంలో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాలనే తెలివైన నిర్ణయం తీసుకున్న వారు ఉద్యోగ స‌మ‌యంలోనూ, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సంపూర్ణమైన కవరేజీతో ఎక్కువ భద్రతను పొందుతారు.

క్లెయిమ్ చరిత్ర, ప్రీమియం..
ఆరోగ్య బీమా ప్రీమియంను నిర్ణ‌యించడంలో వ‌య‌సు ముఖ్య పాత్ర పోషిస్తుంది. యుక్త వ‌య‌సులో క్లెయిమ్ చేసే అవకాశం త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి త‌క్కువ ప్రీమియంకే పాల‌సీ ల‌భించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే మంచి క్లెయిమ్ చరిత్ర ఉంటుంది. భ‌విష్య‌త్తులో వేరే కంపెనీకి పాల‌సీ బ‌దిలీ చేస్తే, కొత్త సంస్థ వైద్య చ‌రిత్రతో పాటు క్లెయిమ్ చ‌రిత్ర‌ను కూడా అడుగుతుంది. క్లెయిమ్‌ల చ‌రిత్ర బాగుంటే కొత్త కంపెనీ మ‌రింత త‌క్కువ ప్రీమియంకు పాల‌సీ ఆఫ‌ర్ చేయ‌వ‌చ్చు. 

నో-క్లెయిమ్ బోన‌స్‌..
ఆరోగ్య బీమాలో ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్‌లు లేక‌పోతే..ఆ ఏడాదికి బీమా సంస్థ‌లు నో-క్లెయిమ్ బోన‌స్‌ను అందిస్తాయి. ప్ర‌తీ నో-క్లెయిమ్ బోన‌స్‌తో అద‌న‌పు ప్రీమియం చెల్లించ‌నవ‌స‌రం లేకుండానే అద‌న‌పు క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా ఆరోగ్యంగా జీవించ‌డంతో పాటు స్థిరంగా పాల‌సీ క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌చ్చు. 

ముందుగానే క‌వ‌రేజ్‌..
యుక్త వ‌య‌సులో పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల అతి పెద్ద ప్ర‌యోజ‌నాల‌లో ఇది ఒక‌టి. ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల విషయంలో వెయిటింగ్ పిరియ‌డ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ స‌మ‌యంలో అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చినా పాల‌సీ కవ‌ర్‌ కాదు. సాధార‌ణంగా వ‌య‌సు పెరిగే కొద్ది దీర్ఘ‌కాలిక వ్యాధుల బారిన ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. చిన్న వ‌య‌సు వారిలో ఇలాంటి వ్యాధులు త‌క్కువే కాబ‌ట్టి యుక్త వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే..ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల మాటే ఉండక‌పోవ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు..
ఆరోగ్య బీమాతో ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుల‌పై రూ. 25 వేల వ‌ర‌కు, త‌ల్లిదండ్రుల కోసం కొనుగోలు చేసిన ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుల‌పై రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందవ‌చ్చు.  చాలా మంది ఉద్యోగులు వారి య‌జ‌మాని అందించిన బృంద బీమా ఉంద‌న్న ఉద్దేశ్యంతో వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ, బృంద బీమా క‌వ‌రేజ్ ఉద్యోగంలో ఉన్నంత వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. 

ల‌క్ష్యాలకు ఆటంకం ఏర్ప‌డ‌కుండా..
వైద్య ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఏదైనా అనారోగ్యం లేదా ప్ర‌మాదం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే, ఆసుప్ర‌తి ఖ‌ర్చుల‌కు వేలు, ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సిందే. ఇందుకోసం పొదుపుతో పాటు, ఇత‌ర ల‌క్ష్యాల కోసం చేసిన పెట్టుబ‌డుల‌ను మ‌ధ్య‌లోనే తీయాల్సి రావ‌చ్చు. ఒక్కోసారి అప్పు కూడా చేయాల్సి వ‌స్తుంది. దీంతో మీ పెట్టుబ‌డుల నుంచి అనుకున్నంత రాబ‌డి రాక‌పోగా, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు దెబ్బ‌తింటాయి. అదే యుక్త వయసు నుంచే ఆరోగ్య బీమా ఉంటే ఇలాంటి అనుకోని ఖ‌ర్చులు ఎదురైనా ల‌క్ష్యాల‌కు ఎలాంటి ఆటంకం ఏర్ప‌డ‌దు. 

చివ‌రిగా..
అనుకోని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కునేందుకు మీరు వేయ‌బోయే మొద‌టి అడుగు ఆరోగ్య బీమా. వ్య‌క్తిగ‌త ఆరోగ్యంతో పాటు కుటుంబంలో ఉన్న వారి శ్రేయ‌స్సు కూడా ముఖ్య‌మే. కుటుంబ స‌భ్యుల వైద్య అవ‌స‌రాలకు స‌రిపోయే క‌వ‌రేజ్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని