Term Plan: ట‌ర్మ్ ప్లాన్‌ తీసుకుంటున్నారా? ఏ రైడ‌ర్లు జ‌త‌చేయొచ్చు?

ట‌ర్మ్ ప్లాన్ హామీ మొత్తం పాల‌సీదారుని వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి.

Updated : 18 Dec 2021 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఇత‌ర పాల‌సీల‌తో పోలిస్తే ట‌ర్మ్ ప్లాన్‌ చౌక‌గా ల‌భిస్తున్న‌ప్ప‌టికీ చాలా మంది దీన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇందులో పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు జీవించి ఉంటే ఎలాంటి ప్ర‌యోజ‌నమూ లభించకపోవడం అనాసక్తికి కారణం. అయితే, ఆధారిత స‌భ్యులు ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ట‌ర్మ్ ప్లాన్‌ భాగం కావాల‌నేది నిపుణుల మాట‌. ఎందుకంటే అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే పెద్ద మొత్తంలో సొమ్ము అందించడం ద్వారా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులపాలు కాకుండా ట‌ర్మ్ ప్లాన్‌ ర‌క్షిస్తుంది. దీనికి రైడ‌ర్ల‌ను చేర్చితే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త‌క్కువ ప్రీమియంతో పొందొచ్చు.

పాల‌సీదారుడు అనుకోకుండా ప్ర‌మాదం బారిన ప‌డిన‌ప్పుడు మ‌ర‌ణిస్తే.. హామీ మొత్తం కుటుంబ స‌భ్యుల‌కు అందుతుంది. అయితే అదృష్ట‌వ‌శాత్తు బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ కొంత మంది క్రిటిక‌ల్ ఇల్‌నెస్ లేదా వైక‌ల్యం బారిన పడే అవకాశాలునాయి. పాల‌సీదారునికి ఆదాయం ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రైడర్లు రక్షణ కల్పిస్తాయి.

ఒక ప్ర‌త్యేక పాల‌సీని తీసుకుంటే చెల్లించే ప్రీమియం కంటే దాన్నే రైడ‌ర్‌గా తీసుకుంటే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. సాధార‌ణ పాల‌సీకి చెల్లించే ప్రీమియంకు కొంత మొత్తాన్ని జోడించి చెల్లిస్తే స‌రిపోతుంది. అయితే, మార్కెట్లో చాలా ర‌కాల రైడ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. పాల‌సీదారులు, వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రైడ‌ర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ యాడ్‌-ఆన్‌, యాక్సిడెంట‌ల్ డెత్‌, ప్రీమియం మాఫీ వంటివి కొన్ని ప్ర‌సిద్ధి పొందిన రైడ‌ర్లు. అద‌న‌పు ర‌క్ష‌ణ కోసం ప్రత్యేక పాల‌సీ కొనుగోలు చేయ‌కుండానే క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌చ్చు. కాబ‌ట్టి రైడ‌ర్ల‌ను యాడ్‌-ఆన్‌లు అని కూడా పిలుస్తారు.

ట‌ర్మ్‌పాల‌సీతో వ‌చ్చే కొన్ని రైడ‌ర్లు..

యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్‌: ట‌ర్మ్ పాల‌సీతో పాటు యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్‌ను తీసుకుంటే ప్ర‌మాద‌వశాత్తు పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, కుటుంబ స‌భ్యుల‌కు సాధార‌ణ బీమా పాల‌సీకి సంబంధించిన‌ పరిహారంతో పాటు అద‌నంగా యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్‌ మొత్తాన్ని కూడా బీమా సంస్థ‌లు అందిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి రూ.1 కోటి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుని దానికి రూ.30 ల‌క్ష‌ల విలువైన యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ యాడ్‌-ఆన్‌ను జ‌త చేశాడ‌నుకుందాం. ఆ వ్య‌క్తి పాల‌సీ వ్య‌వ‌ధిలో స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే ట‌ర్మ్ పాల‌సీకి సంబంధించి రూ.1 కోటి హామీ మొత్తాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెల్లిస్తారు. ఒక‌వేళ ఆ వ్య‌క్తి ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణిస్తే రూ.1 కోటితో పాటు యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ మొత్తం రూ.30 ల‌క్ష‌ల‌ను చేర్చి మొత్తం రూ.1.30 కోట్ల‌ను కుటుంబ స‌భ్యుల‌కు చెల్లిస్తారు. ఈ రైడర్ బదులు బీమా హామీ మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా, దీని ప్రీమియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, రైడర్ ద్వారా బీమా హామీ పెంచుకోవడం వల్ల కొంత వరకు ప్రీమియం తగ్గుతుంది.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌: ప్రాణాంత‌క‌మైన వ్యాధుల బారిన ప‌డిన‌ప్పుడు క్రిటిక‌ల్ ఇల్‌నెస్-యాడ్ఆన్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. మీ సాధారణ ఆరోగ్య బీమా లేదా టర్మ్ జీవిత బీమా పథకానికి క్రిటికల్ ఇల్‌నెస్‌ రైడర్‌ను జత చేయొచ్చు. ఈ రైడర్ చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడంతో పాటు స్వతంత్ర‌ పాలసీ ఇచ్చే ప్రయోజనాలను అందిస్తుంది. బీమా సంస్థ అందించిన జాబితాలోని ‘క్లిష్ట‌మైన అనారోగ్యం’ పాల‌సీదారునికి నిర్ధార‌ణ అయితే ఈ రైడ‌ర్ ఉపయోగపడుతుంది. అందువ‌ల్ల కుటుంబ వైద్య చ‌రిత్ర‌ను అనుస‌రించి ఎలాంటి అనారోగ్యాలు క‌వ‌ర‌వుతున్నాయో తెలుసుకోవాలి. రైడర్‌కు సంబంధించిన పరిమితుల గురించి మీకు అవగాహన ఉండాలి. క్యాన్సర్‌, బైపాస్‌ సర్జరీ, అవయవ మార్పిడి, పక్షవాతం లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన‌ వైద్యఖర్చులు ఎక్కువగా క‌వ‌ర‌వుతాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ఉంటే పూర్తి భరోసా ఉంటుంది.

ప్రీమియం మాఫీ రైడ‌ర్‌: పేరుకు త‌గిన‌ట్లుగా పాల‌సీదారునికి ఏదైనా జ‌రిగితే పాల‌సీ మొత్తం జీవిత కాలంలో ఇన్సూరెన్సు ప్రీమియంలు మాఫీ చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు, ప్రమాదం కార‌ణంగా పాల‌సీదారుడు వైక‌ల్యం పొంది లేదా తీవ్ర‌మైన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు నిర్ధార‌ణ అయితే పాల‌సీ గ‌డువు ముగిసే వర‌కు చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ అవుతాయి. పాల‌సీ ప్ర‌యోజ‌నాలు రైడ‌ర్ కాల‌వ్య‌వ‌ధి ముగిసే వర‌కు కొన‌సాగుతాయి. పాల‌సీదారుడి వ‌య‌సు, ధూమ‌పానం వంటి అలవాట్ల ఆధారంగా ప్రీమియం నిర్ణ‌యిస్తాయి బీమా సంస్థ‌లు.

యాక్సిడెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్: ప్రమాదం కారణంగా పాలసీదారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే ఈ యాడ్-ఆన్ అమ‌ల్లోకి వస్తుంది. బీమా సంస్థ హామీ మొత్తం ఒకేసారి చెల్లిస్తుంది.

ఇన్‌కమ్ బెనిఫిట్ రైడర్‌: అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, నామినీకి రాబోయే 5 నుంచి 10 సంవ‌త్స‌రాలు క్ర‌మ‌మైన ఆదాయం ల‌భిస్తుంది. ఇది ప్ర‌ధాన పాల‌సీతో వ‌చ్చే హామీ మొత్తానికి అద‌నంగా ఉంటుంది. అందువల్ల, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ప్రీమియం మినహాయింపు, యాక్సిడెంట‌ల్ డెత్‌, యాక్సిడెంట‌ల్ డిజెబిలిటీ, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ వంటి రైడర్ల‌ను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ అవసరాన్ని బట్టి వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని