Own House: ఇల్లు కొంటున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి

గృహ రుణం ద్వారా మొద‌టిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద వ‌డ్డీ రేట్ల‌పై స‌బ్సిడీ ల‌భిస్తుంది.

Updated : 07 Aug 2022 18:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సొంతిల్లు ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. దీని ద్వారా ఆర్థికంగానూ, సామాజికంగానూ ఒక భద్రత పెరుగుతుందని భావిస్తుంటారు. ఉన్నంతలో ఒక సొంత గూటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఒక దశలో కుదురుగా ఉండనివ్వదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఆందోళనగా మారుతుంది. కానీ, కొద్దిగా ప్రణాళికతో వ్యవహరించి, ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే… సొంతిల్లు పెద్ద కష్టమేమీ కాదు. మరి, అందుకోసం ఎలా సిద్ధం కావాలో చూద్దామా!

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు 30 ఏళ్లలోపే సొంతింటిని కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా దంపతులిద్దరూ ఆర్జిస్తున్న వారు సొంతింటి కలను తొందరగా నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. వివాహమైన తర్వాత కొన్నేళ్లపాటు వేచి చూసి, ఆదాయంలో స్థిరత్వం రాగానే తొలి పెట్టుబడిగా ఇంటినే ఎంచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికే 5-6 ఏళ్లపాటు ఉద్యోగం చేసి ఉంటారు కాబట్టి, ఖర్చులు ఎంత అవుతున్నాయి? ఎంత మిగులుతోంది? అనే స్పష్టత వారికి వచ్చి ఉంటుంది. అయితే, జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఇల్లు కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి? ఇల్లు కొన్నాక భవిష్యత్‌ ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి అనే విషయాలపై స్పష్టత కూడా రావాలి.

కాల‌ వ్యవధి, ఈఎంఐ..: చిన్న వయసులోనే సొంతిల్లు కోసం రుణం తీసుకోవడం వల్ల దానిని తిరిగి చెల్లించేందుకు కావాల్సినంత వ్యవధి దొరుకుతుంది. రుణ వ్యవధిని నిర్ణయించుకునేందుకు కొంత వెసులుబాటూ ఉంటుంది. వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా అంతగా ఉండదు. ఫలితంగా ఖర్చుల కోసం పెద్దగా ఇబ్బందీ ఉండదు.

పన్ను భారం లేకుండా..: పన్ను పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు ఆదాయ పన్ను నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను భారం తగ్గించుకునేందుకు గృహరుణం ఎంతో ఉపయోగపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగులే అయినప్పుడు… వారిద్దరూ చెల్లించే పన్నును కలిపి చూస్తే అది అధికంగానే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గృహరుణం ఉంటే.. పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం సొంతింటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు అసలును సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు. ఇందులో నిబంధనల మేరకు రూ. 1,50,000 వరకూ చూపించుకునే వీలుంటుంది.

పెట్టుబడులు, ఖర్చులు..: ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో ఖర్చులు ఎంత అవుతున్నాయనే విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. ఇది ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది కూడా. దీనికి బదులుగా ఆదాయంలో స్థిరత్వం రాగానే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన వస్తే రుణం తీసుకొని, అందుబాటులో ఉన్న ఇల్లును కొన్నారనుకోండి.. దానికి వాయిదాలు చెల్లించడం, ఆ తరువాత మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేయడం లాంటి విషయంలో ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. అద్దెకు బదులుగా సొంతింటి కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించడం ద్వారా ఇదీ ఒక సుదీర్ఘ పెట్టుబడిని ప్రారంభించినట్లు అవుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. పైగా సొంతిల్లు ఆర్థిక భద్రతనూ ఇస్తుంది.

వడ్డీలో రాయితీ..: ఇల్లు కొనకుండా అద్దెకు ఉండవచ్చు. ఇది ఒక ప్రత్యామ్నాయమే. కానీ, సొంతిల్లు ఉండటం అనేది మానసికంగా కొండంత ధైర్యాన్ని ఇస్తుందనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలని ప్రభుత్వమూ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు ఆకర్షణీయమైన పథకాలను అందిస్తోంది. పన్ను ప్రయోజనాలతోపాటు.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటిసారి ఇల్లు కొన్న వారికి ఇందులో భాగంగా నిబంధనల మేరకు చెల్లించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఇంటి రుణ భారం తగ్గించుకునే వీలుంది.

పెట్టుబడి వృద్ధి..: దేశంలో వ్యక్తికీ, భూమికీ విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. అందులోనూ ఇంటి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఆదుకునేవి భూమి, ఇల్లులే. ఇక మన దేశంలో వీటి ధరలు దీర్ఘకాలంలో పెరిగేవే గానీ, తగ్గడం అంత సులభం కాదు. సొంతిల్లు మీకు ఆర్థికంగా రక్షణ ఇవ్వడంతోపాటు..  పెట్టుబడి వృద్ధికీ సహాయపడుతుంది. చిన్న వయసులోనే ఇంటిపై పెట్టుబడి పెట్టినవారికి కాలం గడుస్తున్న కొద్దీ వారు పెట్టుబడి పెట్టిన మొత్తం కన్నా అధిక ప్రయోజనం లభిస్తుందనడంలో సందేహం ఉండదు.

చివరగా..: ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం. అయితే, దీని కోసం ఇతర ఆర్థిక లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకండి. వీలయితే, కొన్నేళ్ల పాటు ఇల్లు కొనడాన్ని వాయిదా వేసుకుని డౌన్‌పేమెంట్‌ కోసం ఇప్పటి నుంచే మదుపు చేయండి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని