Gold: బంగారం కొంటున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి..

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా డిజిట‌ల్‌గా బంగారాన్ని కొనుగోలు చేయ‌డం మంచిది.

Published : 18 Mar 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శుభ‌కార్యాలు, పండుగల సమయంలో భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అక్ష‌య తృతీయ‌, ధ‌న‌త్ర‌యోద‌శి వంటి శుభ‌దినాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. త్వరలో వివాహాల సీజన్‌ రాబోతోంది. ఆ సమయంలో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఒకవేళ మీరు కూడా భౌతిక బంగారాన్ని కాయిన్లు, బార్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు వహించండి..

బంగారం ధర: బంగారాన్ని కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దాని ధర. పసిడి ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. స్వల్పకాలంలోనే చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. వివిధ అంశాల ఆధారంగా బంగారం ధర మారుతుంది. దేశ‌మంత‌టా కూడా ఒకేలా ఉండ‌దు. ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండొచ్చు. కొనుగోలు చేసే ముందు బంగారం ధరను ఒకట్రెండు షాపుల్లో ఆరా తీయాలి. విశ్వసనీయ వెబ్‌సైట్లలో కూడా రేట్లు తనిఖీ చేయొచ్చు.

బంగారం స్వచ్ఛత: బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల‌లో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ, ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు.

హాల్ మార్కింగ్: ఆభ‌ర‌ణాల‌ను అచ్చంగా బంగారంతోనే త‌యారు చేయ‌డం సాధ్యం కాదు. అందువ‌ల్ల ఇత‌ర లోహాల‌ను బంగారంతో క‌లిపి ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వ‌ర‌కు క‌లిపారన్న దానిపై ఆ న‌గ స్వ‌చ్ఛ‌త ఆధార‌ప‌డి ఉంటుంది. హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ (22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు)ను తెలియ‌జేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం బీఐఎస్ హాల్ మార్క్‌ను కలిగి ఉంటే మంచిది. ఒకవేళ మీకు బంగారు హాల్‌మార్క్‌ గురించి ఫిర్యాదులు ఉంటే బీఐఎస్‌ను నేరుగా సంప్రదించొచ్చు.

తయారీ రుసుములు: దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా త‌యారీ రుసుములు మారుతూ ఉంటుంది. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వ‌ర‌కు తయారీ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంత తయారీ రుసుము గాను, కొంత తరుగు రూపంలో మీ నుంచి వసూలు చేస్తారు.

కొనుగోలు చేసే విధానం: బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు స్థానిక స్వర్ణకారుడి వద్ద గానీ లేదా బ్రాండెడ్ ఆభరణాల షోరూమ్‌లో గానీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇందుకు వెబ్‌సైట్స్‌, ఎంఎంటీసీ వంటి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు గోల్డ్ కాయిన్‌ కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించొచ్చు. చాలా బ్యాంకులు వేరు వేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి.

అమ్మకానికి వీలుగా: బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, ప్రాఫిట్ మార్జిన్, పన్ను వంటివి వ‌ర్తిస్తాయి. తిరిగి విక్రయించేటప్పుడు మాత్రం ఇవేమీ తిరిగిరావు. పైగా వేస్టేజ్ రూపంలో కొంత త‌గ్గించే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా రాళ్లు ఉన్న ఆభ‌ర‌ణాల‌కు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువ‌ల్ల రాళ్లు ఎక్కువ‌గా లేని ఆభ‌రణాల‌ను కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించాలి.

డిస్కౌంట్: కొన్ని షోరూమ్‌లు సంద‌ర్భానుసారంగా వివిధ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ ఆఫర్లను ఒకసారి పరిశీలించండి. కొంతమంది దుకాణదారులు నెలవారీ డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తుంటారు. డిపాజిట్ కాలం పూర్తయ్యాక తయారీ ఛార్జీలు, తరుగు లేకుండా బంగారం కొనుగోలు చేసే వీలు కల్పిస్తారు.

చివ‌రగా..: కొంత మంది బంగారాన్ని నిల్వ చేసేందుకు, మరికొంత మంది పెట్టుబడి సాధనాలుగా కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబ‌డుల కోసం కొనుగోలు చేసేవారు.. త‌మ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం వ‌ర‌కు బంగారంలో మదుపు చేయొచ్చు. గోల్డ్ కాయిన్లు, ఆభరణాల రూపంలో కాకుండా సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా డిజిట‌ల్‌గా బంగారాన్ని కొనుగోలు చేయ‌డం మంచిది. భౌతిక బంగారం, నిల్వ, నిర్వహణ, భద్రత వంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాల్లో కాల‌ప‌రిమితి వ‌ర‌కు కొన‌సాగిస్తే ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని