Insurance: ఎలక్ట్రిక్‌ వాహనానికి బీమా కొనుగోలు చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

మీ ఎలక్ట్రిక్‌ వాహనం కోసం బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 18 Jan 2023 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ప్రమాదవశాత్తు నష్టం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు, వాహన దొంగతనం, వాహనం వల్ల థర్డ్‌ పార్టీకి గాయాలు/ఆస్తి నష్టం వంటివి బీమా కింద కవర్‌ అవుతాయి. ఇంధన ధరలు, వాయు కాలుష్యం వంటి కారణాలతో ఎలక్ట్రిక్‌ వాహనాలు (EV) భారతదేశంలో పెరగడం ప్రారంభించాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల పెరుగుదలకు సహాయపడుతున్నాయి. ఇతర వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా భారతీయ రోడ్లపై నడపడానికి బీమా అవసరం. EV కోసం బీమాను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సమగ్ర కవర్‌

ఇంధన ఆధారిత వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఖరీదైనవి. అందువల్ల థర్డ్‌-పార్టీ కవర్‌ మాత్రమే కాకుండా వాహనాన్ని పూర్తిగా కవర్‌ చేసే సమగ్ర పాలసీ ఎంచుకోవాలని బీమా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే విస్తృత రక్షణ కోసం బీమా సంస్థలు అందించే యాడ్‌-ఆన్‌ కవర్‌ల కోసం ప్రయత్నించండి. 

ప్రీమియం

పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్‌లతో పోలిస్తే.. అధిక మరమ్మతు  ఖర్చులు, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ఖర్చు కారణంగా EV సమగ్ర బీమా పాలసీ ప్రీమియంలు ఎక్కువగానే ఉంటాయి. EVలలో ఉపయోగించిన అధునాతన సాంకేతికతలు కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే, వినియోగదారులు థర్డ్‌-పార్టీ ప్రీమియంలపై 15% తగ్గింపును పొందొచ్చు.

జీరో-డిప్రిసియేషన్‌ యాడ్‌-ఆన్‌

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కాంపోనెంట్‌లు హై-ఎండ్‌ టక్నాలజీని ఉపయోగించి తయారుచేసినవి కాబట్టి, వీటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. జీరో-డిప్రిసియేషన్‌ యాడ్‌-ఆన్‌ కవరేజీ తీసుకున్నవారికి క్లెయిమ్‌ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. క్లెయిముల్లో తరుగుదలను లెక్కించరు. ఉదా: బ్యాటరీల తరుగుదల వేగంగా ఉంటుంది. ఇలాంటివన్నీ జీరో-డిప్రిసియేషన్‌ యాడ్‌-ఆన్‌లో కవర్‌ అవుతాయి.

స్థాన ప్రభావం

కొన్ని ప్రదేశాల్లో వాతవరణంలో మార్పులు తీవ్రంగా ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో తరచూ అల్లర్లు లేదా దొంగతనాలు, ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల పరిధిలో ఉన్న వాహనాలకు నష్టం కూడా అధిక స్థాయిలోనే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల వాహనాల బీమా ప్రీమియం దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్నదాని కంటే ఎక్కువగానే ఉంటుంది.

ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వాల్యూ(IDV)

వివిధ బీమా కంపెనీలు వేర్వేరు బీమా హామీ (IDV) అందిస్తాయి. మీరు ఎంచుకున్న బీమా సంస్థ అందించే IDV తనిఖీ చేసే ముందు, వాహన ప్రస్తుత మార్కెట్‌ విలువను అంచనా వేయడం ముఖ్యం. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్‌ వాహన బీమా పాలసీలను పోల్చి చూసేటప్పుడు, మార్కెట్‌ విలువకు దగ్గరగా ఉండే IDV ఎంచుకోవాలి. దొంగతనం జరిగినా లేదా వాహనం పూర్తిగా నష్టపోయినా ఇది ఉపయోగపడుతుంది.

పే యాజ్‌ యూ డ్రైవ్‌ (PAYD) యాడ్‌-ఆన్‌

ఎలక్ట్రిక్‌ కార్లు నగర ప్రాంతాల్లో పరిమిత దూరాలకు నడుపుతున్నారు. అందువల్ల ఇంధన కార్లతో పోలిస్తే నడిచే దూరం తక్కువగానే ఉంటుంది. ఈ వాహనాలకు ‘PAYD’ యాడ్‌-ఆన్‌ సౌకర్యంతో తక్కువ దూర ప్రయాణానికి తక్కువ ప్రీమియం చెల్లించి బీమాను పొందొచ్చు. అంటే వాహనం ఎంత నడిపితే, అంత బీమా ప్రీమియం చెల్లించొచ్చు. ఇది డిస్కౌంట్‌ రేట్లలో ప్రీమియంను అందిస్తుంది.

చివరిగా: పైన తెలిపిన వాటితో పాటు క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో (CSR) కూడా ముఖ్యమైనది. అధిక ‘CSR’ ఉన్న బీమా పాలసీ ఎంచుకోవడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని