వెండి కొంటున్నారా? స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోండి..

బంగారంతో పోలిస్తే ధ‌ర త‌క్కువ‌గా ఉండడంతో కొంత‌ మంది దీన్ని బంగారానికి ప్ర‌త్యామ్నాయంగా చూస్తున్నారు. 

Updated : 08 Feb 2022 14:01 IST

బంగారం త‌ర్వాత భార‌తీయులు ఎక్కువ‌గా కొనుగోలు చేసే లోహం వెండి. బంగారంతో పోలిస్తే ధ‌ర త‌క్కువ‌గా ఉండడంతో కొంత‌ మంది దీన్ని బంగారానికి ప్ర‌త్యామ్నాయంగా చూస్తున్నారు. వెండి ఉంగ‌రాలు, చైన్లు ఇలా ప‌లు ర‌కాల ఆభ‌ర‌ణాలు మ‌న‌కి మార్కెట్లో ద‌ర్శ‌నమిస్తున్నాయి. అంతేకాకుండా వివాహ మ‌హోత్స‌వాలలోనూ, పూజ‌ల‌లో వెండి సామాగ్రిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. బ‌హుమ‌తుల రూపంలో కూడా ఎక్కువ‌గా వెండి వ‌స్తువుల‌ను ఇస్తుంటారు. ఇంత‌టి ప్రాధాన్య‌త ఉన్న వెండిని కొనుగోలు చేసేట‌ప్పుడు నాణ్య‌త‌, స్వచ్ఛత విష‌యంలో మోస‌పోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, కొనుగోలు స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అంటున్నారు నిపుణ‌లు. 

వెండి కొనుగోలు చేసేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు..
స్వ‌చ్ఛ‌త‌..
బంగారు ఆభ‌ర‌ణాల‌పై ఉన్న హాల్ మార్క్ చిహ్నం ఆధారంగా.. దాని స్వచ్ఛ‌త‌ను తెలుసుకుంటాం. అలాగే వెండి ఆభ‌ర‌ణాల స్వచ్ఛతను కూడా హాల్‌మార్క్ చిహ్నంతో తెలుసుకోవ‌చ్చు. బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌(బీఐఎస్‌) బంగారం మాదిరిగానే వెండిపై కూడా దాని స్వచ్ఛతను తెలియ‌జేస్తూ హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది. ఒక లోహాన్ని హాల్‌మార్క్ చేయ‌డం వ‌ల్ల దాని స్వచ్ఛతను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. ఒక‌వేళ మీరు కొనుగోలు చేసిన వెండిపై హాల్‌మార్క్ లేక‌పోతే హాల్‌మార్క్ చేయ‌మ‌ని అడ‌గ‌వ‌చ్చు. 

హాల్‌మార్క్ అంటే..
బంగారం, ప్లాటినం, వెండి వంటి విలువైన లోహాల ఖచ్చిత‌త్వాన్ని నిర్థారించేదే హాల్‌మార్క్‌. ఏదైనా విలువైన లోహంతో తయారుచేసే వస్తువులో.. ఆ లోహం ఎంత శాతముందో ఖ‌చ్చితంగా నిర్ధారించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌మార్కింగ్. అమ్మ‌కం దారులు త‌క్కువ స్వ‌చ్చ‌త ఉన్న ఆభ‌ర‌ణాలు ఎక్కువ విలువ‌కు అమ్మ‌కుండా హాల్‌మార్కింగ్ నివారిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కి ఒక స్వ‌ర్ణకారుడు 22 క్యారెట్ల బంగారాన్ని 24 క్యారెట్ల బంగారంగా కొనుగోలు దారులకు విక్ర‌యించ‌వ‌చ్చు. దీంతో త‌క్కువ విలువ ఉన్న వ‌స్తువును ఎక్కువ ధ‌ర చెల్లించి వినియోగ‌దారులు మోస‌పోయే అవ‌కాశం ఉంది. ఇలాంటి మోసాల‌ను అడ్డుకునేందుకు హాల్‌మార్కింగ్ చిహ్నాన్ని తీసుకొచ్చారు. 

వెండికి హాల్‌మార్కింగ్..
వెండికి హాల్‌మార్కింగ్ చేయ‌డాన్ని బిఐఎస్ 2005లో ప్రారంభించింది. అప్పటి నుంచి  హాల్‌మార్క్ చేయబడిన వెండి కళాఖండాలు, ఆభరణాలను విక్రయించడానికి గానూ డీల‌ర్ల‌కు హాల్‌మార్క్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. బిఐఎస్ స్టాండర్డైజేషన్, సర్టిఫికేషన్, క్వాలిటీ నిబంధ‌న‌ల‌తో వెండి ఆభ‌ర‌ణాల‌ను హాల్‌మార్కింగ్ చేస్తారు. 

వెండి వస్తువు లేదా ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను ఎలా గుర్తించాలి..
బిఐఎస్ మార్క్ త్రిభుజాకారంలో ఉండి లోప‌ల చెక్క‌తో ఉంటుంది. ఇది బీఐఎస్ అధికారిక లోగో. వెండికి స్వచ్ఛత గ్రేడ్ 999.9, 999.5 లేదా 999 తో ఉంటుంది. వెండి మిశ్రమాలు, ఆభరణాలు, కళాఖండాల కోసం ఇది 970, 925, 900, 835, 800 గా కూడా ఉంటుంది. 

నకిలీ నాణేలు..
పండుగ‌ల‌కు, శుభ‌కార్యాల‌కు బంగారం, వెండి కొనుగోలు చేయ‌డం శుభ‌ప్ర‌దంగా భావిస్తారు భార‌తీయులు. ధ‌న‌త్ర‌యోద‌శి వంటి పండుగ‌ల‌కు బంగారం కొనుగోలు చేయ‌లేని వారు వెండిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో నాణేల రూపంలో వెండిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. మార్కెట్‌లో బంగారం, వెండి నాణేలకు డిమాండ్‌ను అవ‌కాశంగా మ‌లుచుకుని, న‌కిలీ నాణేలు చలామ‌ణిలోకి తీసుకొస్తున్నారు మోస‌గాళ్లు. ఈ కార‌ణంగా మీరు కొనుగోలు చేస్తున్న‌ది న‌కిలీనా.. ఒరిజిన‌ల్ ఆ.. అనేది ఒక‌టి రెండు సార్లు నిర్థారించుకోండి.

ఆభరణాల బై-బ్యాక్ పాలసీ..
ఆభరణాలు కొనుగోలు చేసేట‌ప్పుడు బైబ్యాక్ పాలసీ గురించి రీటైలర్‌ను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే కొత్త ఆభ‌ర‌ణాలను కొనుగోలు చేసేటప్పుడు మీ వ‌ద్ద ఉన్న పాత ఆభరణాలను అమ్మవచ్చు. అలాగే ఇప్పుడు కొనుగోలు చేసిన ఆభ‌ర‌ణాన్ని భ‌విష్య‌త్తులో అదే దుకాణంలో విక్ర‌యిస్తే ఎక్కువ‌గా త‌గ్గుద‌ల ఉండ‌క‌పోవ‌చ్చు. ఉదాహరణకు, మీరు 925 గ్రేడ్‌కు చెందిన ఆభరణాన్ని కొనుగోలు చేస్తే, మీరు కొన్న అదే దుకాణంలో ఆభరణాలు విక్రయిస్తే.. మీకు 92.5 శాతం వెండి విలువ తిరిగి పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. 

త‌యారీ ఛార్జీలు..
బంగారం లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, త‌యారీ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఈ ఛార్జీల‌ను నగల వ్యాపారి కోట్ చేస్తార‌ని చాలా మందికి తెలియదు. అందువల్ల, మీరు కొనుగోలు చేసే న‌గ‌ల‌లో వినియోగించిన బంగారం లేదా వెండి అసలు ధ‌ర ఎంత‌? త‌యారీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు?ఇలాంటి స‌మాచారాన్ని వివ‌రంగా తెలియ‌జేయ‌మ‌ని దుకాణా దారున్ని అడ‌గండి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఇత‌ర వ్యాపారుల వ‌ద్ద ధ‌ర‌ల‌ను పోల్చి చూడ‌వ‌చ్చు. 

వెండి ఆభరణాలపై రత్నాలు..
ర‌త్నాల‌తో కూడిన ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు చాలా మంది దుకాణదారులు ర‌త్నంతో క‌లిపి ఆభ‌ర‌ణాన్ని తూకం వేస్తారు. దీంతో ఆభ‌ర‌ణం బ‌రువు ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. రాయి బ‌రువు వెండితో క‌ల‌ప‌కుండా చూసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌..
ప్ర‌స్తుతం వెండి, బంగారం ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల‌లోనూ ల‌భ్య‌మ‌వుతుంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు వీటిపై డిస్కౌంట్లు, రాయితీలు, క్యాష్‌బ్యాక్‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి సంస్థ‌లు. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌కు ఆక‌ర్షితులై త‌క్కువ‌కు వ‌స్తున్నాయి క‌దా అని ఎదో ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి కొంటే న‌కీలీలతో మోస‌పోయే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి న‌మ్మ‌క‌మైన పేరున్న సంస్థ‌ల నుంచి మాత్ర‌మే విలువైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని