BYJUS Aakash IPO: బైజూస్‌ ఆకాశ్‌ ఐపీఓ.. ఎప్పుడంటే?

BYJU'S Aakash IPO: తమ అనుబంధ సంస్థ ఆకాశ్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురానున్నట్లు బైజూస్‌ తెలిపింది. ‘ఆకాశ్‌’ను బైజూస్‌ 2021 ఏప్రిల్‌లో రూ.7,100 కోట్లకు స్వాధీనం చేసుకుంది.

Published : 05 Jun 2023 14:40 IST

దిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌ (BYJU'S) తమ అనుబంధ సంస్థ ‘ఆకాశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL)’ను ఐపీఓకి తీసుకురానుంది. వచ్చే ఏడాది మధ్య నాటికి పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ ప్రారంభమవుతుందని సోమవారం ప్రకటించింది. ఏఈఎస్‌ఎల్‌ ఆదాయం గాడిన పడుతోందని తెలిపింది. 2023- 24 నాటికి రూ.900 కోట్ల EBITDAతో కలిపి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేసింది.

‘ఆకాశ్‌’ ఐపీఓ (Aakash IPO)కు బైజూస్‌ (BYJU'S) బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటించింది. ఐపీఓ ప్రక్రియ సజావుగా సాగేందుకు త్వరలో మర్చంట్‌ బ్యాంకర్లను నియమిస్తామని తెలిపింది. ఐపీఓ (Aakash IPO) ద్వారా సమకూరిన నిధులతో ‘ఆకాశ్‌’ మౌలిక వసతులను బలోపేతం చేస్తామని వెల్లడించింది. అలాగే కంపెనీ కార్యకలాపాలను విస్తరిస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని చెప్పింది.

‘ఆకాశ్‌’ను బైజూస్‌ (BYJU'S) 2021 ఏప్రిల్‌లో రూ.7,100 కోట్లకు స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా 325 ఆకాశ్‌ సెంటర్లున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులకు సేవలందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని