Byjus CEO: ‘తప్పలేదు.. క్షమించండి’.. ఉద్యోగుల తొలగింపుపై బైజూస్‌ సీఈఓ

ఉద్యోగుల తొలగింపుపై బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రవీంద్రన్‌ స్పందించారు. తొలగించిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు.

Published : 31 Oct 2022 21:15 IST

దిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజుస్‌ (Byju's).. ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 2,500 మందికి ఆ కంపెనీ ఉద్వాసన పలికింది. దీంతో ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిందంటూ ఆ కంపెనీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రవీంద్రన్‌ తాజాగా స్పందించారు. తొలగించిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. పరిస్థితుల ప్రభావం వల్ల తొలగింపు తప్పలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులకు సందేశం పంపించారు. బైజూస్‌ స్థిరత్వం, లాభదాయకతపై దృష్టి సారించినట్లు చెప్పారు.

వేగంగా వృద్ధి చెందే క్రమంలో సంస్థలో అవసరానికి మించిన మానవ వనరులు గతంలో తీసుకోవాల్సి వచ్చిందని రవీంద్రన్‌ పేర్కొన్నారు. అలాంటి సంస్థను హేతుబద్ధీకరించడంలో భాగంగా 5 శాతం (2,500) మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. బైజూస్‌ను విడిచి వెళ్లిన వారికి క్షమాపణ చెబుతున్నానని చెప్పారు. 2022లో ఎదురైన అనేక పరిస్థితులు వ్యాపార స్వరూప స్వభావాన్నే మార్చివేశాయని, ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్‌ కంపెనీలూ స్థిరత్వం, లాభదాయకతపై దృష్టి సారించాయని రవీంద్రన్‌ అన్నారు. ఇందుకు బైజూస్‌ సైతం ఏమీ మినహాయింపు కాదన్నారు. 

రోల్‌ డూప్లికేషన్లను నివారించడంలో భాగంగా ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రవీంద్రన్‌ తెలిపారు. ఉద్యోగాలను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. కంపెనీ లాభాల్లోకి వచ్చి స్థిరత్వం సాధించాక.. తొలగించిన ఉద్యోగులను కంపెనీలో భాగస్వామ్యం చేసుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తమ మానవ వనరుల విభాగానికి సైతం తెలియజేసినట్లు చెప్పారు. కొత్తగా సృష్టించే ఏ పోస్ట్‌కైనా తొలగించిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు