Byjus: బైజూస్‌కు డెడ్‌లైన్‌.. 40 మి.డాలర్ల వడ్డీ చెల్లింపునకు నేడే గడువు

Byjus: త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా బైజూస్‌ 40 మిలియన్‌ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. దీనికి నేడే తుది గడువు.

Published : 05 Jun 2023 10:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byju's) భారీ ఎత్తున వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా 40 మిలియన్‌ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. దీనికి నేడు (జూన్‌ 5) తుది గడువు. ఈ నేపథ్యంలో సకాలంలో చెల్లించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. అయితే, చివరి నిమిషంలో ప్రణాళికలో ఏమైనా మార్పులు జరిగే అవకాశమూ లేకపోలేదని పేర్కొన్నారు.

ఒకవేళ 40 మిలియన్‌ డాలర్ల వడ్డీని సకాలంలో చెల్లించకపోతే.. 1.2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఎగవేసినట్లవుతుంది. దీనిపై ఇప్పటి వరకు బైజూస్‌ (Byju's) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కరోనా సంక్షోభ సమయంలో బైజూస్‌ కార్యకలాపాలు భారీగా విస్తరించిన విషయం తెలిసిందే. అయితే, సంక్షోభం సద్దుమణిగిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. దీంతో కంపెనీ ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయింది. 

ఫలితంగా రుణ చెల్లింపులు సందిగ్ధంలో పడ్డాయి. వెంటనే బైజూస్‌ రవీంద్రన్ నేతృత్వంలోని కంపెనీ.. రుణదాతల బృందంతో చర్చలు ప్రారంభించింది. రుణ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించాలని కోరింది. కానీ, ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్రస్తుతం 40 మిలియన్‌ డాలర్ల వడ్డీని సకాలంలో చెల్లిస్తే.. మరింత మూలధనాన్ని సమీకరించుకొనేందుకు కంపెనీకి అవకాశం లభిస్తుంది. తద్వారా కార్యకలాపాలను గాడినపెట్టేందుకు సమయం లభిస్తుంది. లేదంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు అంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని