Byjus laysoff: ఉద్యోగులకు మరోసారి బైజుస్‌ షాక్‌.. 1000 మంది ఇంటికి!

Byjus laysoff: బైజుస్‌లో మరోసారి ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా 1,000 మందిని ఇంటికి పంపించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 02 Feb 2023 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎడ్‌టెక్‌ సంస్థ బైజుస్‌ (Byjus) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. గతంలో 2,500 మందిని తొలగించిన ఈ యూనికార్న్‌ సంస్థ.. తాజాగా దాదాపు మరో 1000 మందిని తొలగించిందని (Layoffs) పలు ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. డిజైన్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు తెలిసింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గతేడాది అక్టోబర్‌లో 2,500 మందిని బైజుస్‌ తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంటూ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ తెలిపారు. భవిష్యత్‌లో లేఆఫ్‌లు ఉండబోవని ఉద్యోగులకు అభయమిచ్చారు. అయితే, నెలలు తిరగకముందే మరో 1000 మందిని తొలగించడం గమనార్హం. ఆపరేషన్స్‌, లాజిస్టిక్స్‌, కస్టమర్‌ కేర్‌, ఇంజినీరింగ్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ వంటి విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు ముందుగా ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని తెలిసింది. కార్యాలయాలకు వచ్చిన వారికి నేరుగా పింక్‌ స్లిప్‌ ఇచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరికొందరికి వాట్సాప్‌ లేదా నేరుగా కాల్స్‌ చేసి గూగుల్‌ మీట్‌లో కనెక్ట్‌ అవ్వాలని సూచించి తర్వాత  తొలగించడంపై విషయంపై సమాచారం ఇస్తున్నారని పలువురు పేర్కొన్నారు. నోటీసు పీరియడ్‌ పూర్తయ్యాక పరిహార ప్యాకేజీ చెల్లిస్తామని బైజుస్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.4589 కోట్ల నష్టాలను బైజుస్‌ ప్రకటించింది. కంపెనీని ఎలాగైనా లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆ కంపెనీ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని