Byjus: వైట్‌హ్యాట్‌ జూనియర్‌కు బైజూస్‌ మంగళం?

BYJUS- WhiteHat Jr: నష్టాల్లో ఉన్న వైట్‌హ్యా్‌ట్‌ జూనియర్‌ సంస్థను మూసివేయాలని బైజూస్‌ భావిస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Published : 23 Feb 2023 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎడ్‌టెక్‌ కంపెనీలకు కష్టకాలం కొనసాగుతోంది. కొవిడ్‌ సమయంలో ఓ వెలుగు వెలిగి.. తర్వాత నష్టాల బాటలో పట్టిన ఆయా కంపెనీలు తర్వాత ఉద్యోగులను పెద్దఎత్తున తొలగించాయి. ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ (Byjus) సైతం అదే చేసింది. తాజాగా ఖర్చులను తగ్గించుకునేందుకు బైజూస్‌ మరో మార్గం ఎంచుకుంది. ఇన్నాళ్లు లేఆఫ్‌లు ప్రకటించడం ద్వారా నష్టాలను తగ్గించుకున్న ఆ సంస్థ.. నష్టాల్లో ఉన్న తన కోడింగ్‌ ప్లాట్‌ఫాం వైట్‌ హ్యా్ట్‌ జూనియర్‌ను (WhiteHat Jr) ఏకంగా మూసివేయాలని యోచిస్తోందని తెలిసింది. ప్రస్తుతం మూసివేతకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని కొన్ని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

2020లో వైట్‌హ్యాట్‌ జూనియర్‌ను బైజూస్‌ 300 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, కొవిడ్‌ అనంతరం ఎడ్‌టెక్‌ సంస్థలకు ఆదరణ తగ్గడంతో ఆయా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే వైట్‌హ్యాట్‌ జూనియర్‌లో 300 మంది ఉద్యోగుల్ని బైజూస్‌ సాగనంపింది. కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించడంతో మరో 800 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1690 కోట్ల నష్టాన్ని వైట్‌హ్యాట్‌ ప్రకటించింది. ఈ కాలంలో తన కార్యకలాపాల ద్వారా రూ.483.9 కోట్లు ఆర్జించగా.. ఖర్చులను రూ.2,175.9 కోట్లుగా చూపింది. కరోనా సమయంలో వచ్చిన ఊపుతో అంతర్జాతీయంగానూ విస్తరించాలన్న ప్రణాళికలు ఖర్చులు పెరగడానికి కారణమయ్యాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హ్యాట్‌ జూనియర్‌ను మూసివేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని బైజూస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని