BYJUS: సీఎంతో బైజూస్‌ బాస్‌ భేటీ.. ఉద్యోగాల కోతపై వెనక్కి

ఖర్చు తగ్గింపులో భాగంగా ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ ఇటీవల  భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 2,500 మందికి ఆ కంపెనీ ఉద్వాసన పలికింది. దీనిపై ఆ సంస్థ విమర్శలు ఎదుర్కొంటోంది.

Updated : 02 Nov 2022 20:21 IST

తిరువనంతపురం: ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూన్‌(Byju's) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో విధుల నుంచి తొలగించిన 140 మంది ఉద్యోగులను వెనక్కి తీసుకోవడంతో పాటు తిరువనంతపురంలో కార్యకలాపాలను పునరుద్ధరించనుంది. ఉద్యోగుల తొలగింపు విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ భేటీ అయిన తర్వాత బైజూస్‌ ఈ ప్రకటన విడుదల చేసింది.

‘‘సీఎం పినరయి విజయన్‌తో బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ సుదీర్ఘంగా జరిపిన చర్చల అనంతరం తిరువనంతపురంలోని మా కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించాం. దీని ఫలితంగా ఈ కేంద్రం నుంచి తొలగించిన 140 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో కొనసాగుతారు. కేరళకు చెందిన రవీంద్రన్.. సొంత రాష్ట్ర అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు’’ అని బైజూన్‌ ఈ ప్రకటనలో వెల్లడించింది.

బైజూస్‌ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా 5శాతం ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని చెప్పిన రవీంద్రన్‌.. ఆ ఉద్యోగులకు క్షమాపణలు కూడా తెలిపారు. ఖర్చు తగ్గింపుల నిమిత్తం తీసుకున్న ఈ నిర్ణయంలో భాగంగా తిరువనంతపురంలోని బైజూస్‌ టెక్నోపార్క్‌ను మూసివేసింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు కేరళ రాష్ట్ర కార్మిక మంత్రిని ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కంపెనీ  తమ కార్యాలయాన్ని మూసివేసి, తమను విధుల నుంచి తొలగించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు అభ్యర్థించారు. దీంతో కార్మిక మంత్రి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. నేడు రవీంద్రన్‌, సీఎంతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉద్యోగుల కోత అంశంపై కంపెనీ వెనక్కి తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని