ప్రత్యర్థి చేతికి టిక్‌టాక్‌ వ్యాపారం?

భారత్‌ సహా దక్షిణాసియాలోని పలు దేశాల్లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌.. తన భారత వ్యాపారాన్ని విక్రయించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు భారత్‌లోని

Published : 13 Feb 2021 21:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సహా దక్షిణాసియాలోని పలు దేశాల్లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌.. తన భారత వ్యాపారాన్ని విక్రయించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు భారత్‌లోని తన ప్రత్యర్థి అయిన బెంగళూరుకు చెందిన యూనికార్న్‌ గ్లాన్స్‌తో (రోపోసో యాప్‌ మాతృ సంస్థ) టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గ్లాన్స్‌కు ఆర్థిక దన్ను అందిస్తున్న జపాన్‌ సాఫ్ట్‌ బ్యాంక్‌తో ఈ మేరకు చర్చలు ప్రారంభించినట్లు ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు తెలియజేశారు. సాఫ్ట్‌బ్యాంక్‌, బైట్‌ డ్యాన్స్‌, గ్లాన్స్ కలిపి ఈ చర్చలు జరుపుతున్నాయని, ఈ డీల్‌ కొలిక్కి రావాలంటే భారత అధికార వర్గాల అనుమతి తప్పసరని సదరు వ్యక్తులు పేర్కొన్నారు. చర్చలు పూర్తయితే టిక్‌టాక్‌ యూజర్ల డేటా దేశంలోనే విడిచిపెట్టాలన్న షరతును భారత ప్రభుత్వం విధించే అవకాశం ఉందని తెలిపారు.

చర్చల గురించి వస్తున్న వార్తలపై అటు సాఫ్ట్‌బ్యాంక్‌ గానీ, ఇటు బైట్‌ డ్యాన్స్‌ గానీ స్పందించలేదు. గ్లాన్స్‌ అధికార ప్రతినిధి సైతం దీనిపై మాట్లాడేందుకు తిరస్కరించారు. భారత్‌లో టిక్‌టాక్‌ దూసుకెళ్తున్న వేళ.. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కారణంగా చూపుతూ టిక్‌టాక్‌ సహా కొన్ని పలు యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సేవలను తిరిగి ప్రారంభించేందుకు టిక్‌టాక్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో భారత్‌లోని కార్యకలాపాల నుంచి దూరం జరుగుతూ వచ్చింది. వందలాది ఉద్యోగులను తొలగించింది కూడా. మరోవైపు గ్లాన్స్‌కు చెందిన షార్ట్‌వీడియో వేదిక రోపోసో సైతం టిక్‌టాక్‌కు పోటీగా ఎదుగుతూ వచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం అనంతరం జనాలకు మరింత చేరువైంది. ఇప్పుడు అదే ప్రత్యర్థి చేతికి టిక్‌టాక్‌ భారత వ్యాపారం చేరే సూచనలు ఉండడం గమనార్హం.

ఇవీ చదవండి..
ఏడు స్క్రీన్‌లతో ల్యాప్‌టాప్.. చూశారా?
ప్రేమికుల రోజు స్పెషల్‌.. బహుమతి ఇవ్వాలిగా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని