BSNL పునరుద్ధరణకు ₹1.64 లక్షల కోట్లు.. ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం

BSNL revival package: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్‌ భారీ ప్యాకేజీ ప్రకటించింది.

Published : 27 Jul 2022 19:15 IST

దిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్‌ భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. సేవలు మెరుగు పరచడం, స్పెక్ట్రమ్‌ కేటాయింపు, బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో భాగంగా భారత్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో విలీనం వంటివి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

మొత్తం ప్యాకేజీలో రూ.43,964 కోట్లు నగదు రూపంలో, మిగిలిన రూ.1.2 లక్షల కోట్లు నాలుగేళ్ల కాలానికి నగదు రహితంగా అందించనున్నట్లు మంత్రి తెలిపారు. 4జీ సేవల విస్తరణ కోసం 900/1800 MHz స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించనున్నారు. ఇందుకోసం అయ్యే మొత్తం రూ.44,993 కోట్లను ఈక్విటీలుగా మార్చనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్యాలెన్‌ షీట్‌లో రూ.33,404 కోట్లుగా ఉన్న బకాయిలను సైతం ఈక్విటీలుగా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో 4జీ నెట్‌వర్క్‌ విస్తరణకూ రూ.26,316 కోట్ల నిధులు కేబినెట్‌  కేటాయించింది. దీని ద్వారా 24,680 గ్రామాలకు 4జీ సర్వీసులు అందుతాయని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని