LIC IPO: ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐలపై కేంద్రం కీలక నిర్ణయం

ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న భారతీయ జీవిత బీమా సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....

Updated : 26 Feb 2022 18:10 IST

దిల్లీ: ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంస్థలోకి 20 శాతం ఎఫ్‌డీఐలను నేరుగా అనుమతించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. దీంతో ఎల్‌ఐసీ ఐపీఓ (IPO)లో విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది.

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనేందుకు విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74% వరకు ఎఫ్‌డీఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్‌ఐసీకి వర్తించదు. పార్లమెంటులో చట్టం చేసి ఓ ప్రత్యేక సంస్థగా దీనిని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఇప్పుడు.. ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐ అనుమతించడంతో.. అతిపెద్ద విదేశీ పెన్షన్‌ ఫండ్‌లు, బీమా సంస్థలు దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో పాల్గొనే వీలుంటుంది. దేశీయ సంస్థలో 10% అంతకంటే ఎక్కువ వాటాను కొనే విదేశీ వ్యక్తి / సంస్థను ఎఫ్‌డీఐగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుర్తిస్తుంది.

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని