PLI: ఐటీ హార్డ్‌వేర్‌కు మరింత బూస్ట్‌.. ₹17 వేల కోట్లతో పీఎల్‌ఐ 2.0

PLI: Õఐటీ హార్డ్‌వేర్‌ తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం రెండో దఫా పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించింది. ఈసారి రూ.17 వేల కోట్లు విలువ చేసే ప్రోత్సాహకాలను ప్రకటించింది.

Published : 17 May 2023 18:58 IST

దిల్లీ: భారత్‌లో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం’ (PLI) సత్ఫలితాలిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీలో దీని ప్రభావం అత్యంత సానుకూలంగా ఉంది. దీంతో మరోసారి ఐటీ హార్డ్‌వేర్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం బుధవారం ఆమోదం తెలిపింది.

ఐటీ హార్డ్‌వేర్‌ రంగానికి రూ.17,000 కోట్లు విలువ చేసే తయారీ అనుసంధాన ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించింది. దీని కాలపరిమితి ఆరేళ్లుగా నిర్దేశించింది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆన్‌-ఇన్‌-వన్‌ పీసీలు, సర్వర్లు, అల్ట్రా- స్మాల్‌ ఫార్మ్‌ ఫ్యాక్టర్‌ డివైజ్‌ల తయారీ ఐటీ హార్డ్‌వేర్‌ కిందకు వస్తాయి. వీటి తయారీలో ఉన్న కంపెనీలన్నింటికీ పీఎల్‌ఐ 2.0 కింద ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత ఉంటుంది.

ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.3.35 లక్షల కోట్లు విలువ చేసే అదనపు తయారీ జరుగుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దీంతో 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. 2021 ఫిబ్రవరిలోనూ ప్రభుత్వం ఈ రంగానికి రూ.7,350 కోట్లు విలువ చేసే పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించింది. అయితే, ఈ మొత్తాన్ని మరింత పెంచాలని పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి.

2020 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం తొలిసారి పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. ఇది ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు మంచి ఊతమిచ్చింది. భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీ దేశంగా నిలిచింది. ఈ మార్చి నాటికి 11 బిలియన్‌ డాలర్లు విలువ చేసే మొబైల్‌ ఫోన్లను భారత్‌ ఎగుమతి చేసింది. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకొనే తాజాగా కేంద్రం ఐటీ హార్డ్‌వేర్‌కు రెండో దఫా పీఎల్‌ఐ ప్రోత్సాహకాలను ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని