Home Loan: హోమ్‌లోన్‌ దరఖాస్తు చేసే ముందు అర్హతను తెలుసుకోండి

గృహరుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణించాలి. అవేంటో చూద్దాం.

Updated : 23 Nov 2022 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణం అనేది దీర్ఘకాలిక రుణం. పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి బ్యాంకులు రుణ దరఖాస్తు ఆమోదించే ముందు దరఖాస్తుదారుని అర్హతను తప్పనిసరిగా చెక్‌ చేస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు రుణం తీసుకోవాలనుకుంటే.. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ముందే మీ గృహ రుణ అర్హతను తెలుసుకోండి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో గృహ రుణ అర్హతను తెలియజేసే కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి కొన్ని ప్రముఖ బ్యాంకులు కూడా వాటి వెబ్‌సైట్‌లలో ఈ కాలిక్యులేటర్లను అందిస్తున్నాయి. వీటిలో మీ వయసు, ప్రస్తుత నెలవారీ ఆదాయం, వర్తించే వడ్డీ రేటు, కాలపరిమితి, ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలు వంటి వివరాలు తెలిపితే మీకు ఎంత వరకు రుణ అర్హత ఉంటుంది? నెలవారీగా ఎంత ఈఎంఐ చెల్లించాలో తెలుస్తుంది.

గృహరుణ అర్హతను ప్రభావితం చేసే అంశాలు..

వయసు: సాధారణంగా 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు గృహ రుణం పొందేందుకు అర్హత ఉంటుంది. కొన్ని బ్యాంకులు వ్యక్తుల ఆదాయాలను అనుసరించి 70 ఏళ్ల లోపు వారికి కూడా గృహ రుణం ఇస్తాయి. అయితే తక్కువ వయసున్న వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో రుణం లభించే అవకాశం ఉంటుంది. వయసు తక్కువ ఉన్నప్పుడు పని సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్‌లో సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ఈఎంఐ, ఎక్కువ కాలపరిమితితో రుణం చెల్లింపులు చేయగలుగుతారని బ్యాంకులు విశ్వసిస్తాయి. అదే పెద్ద వయసు వారు అయితే పని సంవత్సరాలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్‌లో సంపాదన ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కువ మొత్తంలో రుణాన్ని ఆమోదించకపోవచ్చు.

ఉదాహరణకు మీ వయసు 30 సంవత్సరాలు.. నెలవారీ ఆదాయం రూ. 50 వేలు. వర్తించే వడ్డీ రేటు 8.40%. కాలపరిమితి 20 ఏళ్లు. ఇతర ఈఎంఐలు లేవనుకుంటే మీకు రూ. 37 లక్షల వరకు రుణ అర్హత ఉంటుంది. దీనికి మీరు నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ సుమారుగా రూ. 32,500. ఒక వేళ మీ వయసు 50 సంవత్సరాలు అయితే చెల్లింపులకు 10 ఏళ్లు మాత్రమే సమయం ఉంటుంది. దాదాపు రూ.25 లక్షల వరకు మాత్రమే రుణం లభించవచ్చు.

ఆదాయం: గృహ రుణం అర్హతను నిర్ణయించే అంశాల్లో కీలకమైనది దరఖాస్తుదారుని ఆదాయం. పన్నులు, ఇతర తగ్గింపుల తర్వాత మీకు చేతికి అందే ఆదాయంతో ఎంత సౌకర్యవంతంగా చెల్లింపులు చేయగలుగుతారనేది బ్యాంకులు చూస్తాయి. 

ఆదాయ స్థిరత్వం: ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికంటే స్థిర ఆదాయం ఉన్న వ్యక్తులకు గృహ రుణం త్వరగా లభించే అవకాశం ఉంటుంది. 

ఇప్పటికే ఉన్న ఈఎంఐలు: మీరు ఇప్పటికే ఇతర రుణాలు ఉండి, వాటి కోసం ఈఎంఐలు చెల్లిస్తుంటే.. రుణం అర్హతను నిర్ణయించడంలో ఇవి కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో ఈఎంఐల (ఇప్పటికే ఉన్న ఈఎంఐలతో పాటు కొత్తగా గృహ రుణం తీసుకుంటే దానికి చెల్లించే ఈఎంఐలను కలిపి చూస్తారు) కోసం చెల్లించే మొత్తం 40-50% మించకుండా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వస్తాయి. అందువల్ల రుణ అర్హతను పెంచుకునేందుకు గృహ రుణానికి దరఖాస్తు చేసే ముందే ఇతర రుణాలను పూర్తిగా చెల్లించడం మంచిది. 

క్రెడిట్‌ స్కోరు: క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉంటే.. ఆ వ్యక్తులు రుణ ఎగవేతలకు పాల్పడరని, క్రమశిక్షణతో ఈఎంఐలు చెల్లిస్తారని బ్యాంకులు నమ్ముతాయి. అందవల్ల మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహించేవారికి రుణాలను త్వరగా ఆమోదించడంతో పాటు, తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తుంటాయి. కాబట్టి, రుణ అర్హతను పెంచుకోవడంతో పాటు వడ్డీ తగ్గించుకునేందుకు మంచి క్రెడిట్‌ స్కోరును నిర్వహించడం మంచిది.

రుణ దరఖాస్తు తిరస్కరణ: మీరు ఇంతకు ముందు కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకుని, అవి తిరస్కరణకు గురైతే వాటి ప్రభావం కొత్త రుణ దరఖాస్తుపై ఉంటుంది. రుణ దరఖాస్తు తిరస్కరించిన ప్రతిసారీ క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. కాబట్టి ఒకసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఎందుకు ఆమోదించలేదో తెలుసుకుని తప్పులను సరిచేసుకున్న తర్వాత మాత్రమే మరోసారి ప్రయత్నించాలి.

సెక్యూరిటీ: గృహ రుణం అనేది మీరు కొనుగోలు చేసే ఇంటి విలువపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు కొనుగోలు చేసే ఇంటి విలువలో 70% నుంచి 90% వరకు గృహ రుణం లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ రుణ అర్హత ఎక్కువగా ఉండి, ఇంటి విలువ తక్కువగా ఉన్నా మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి విలువనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ రుణ అర్హత రూ. 50 లక్షల వరకు ఉండి, మీ ఇంటి విలువ రూ. 30 లక్షలు అయితే ఇంటి విలువను బట్టి రూ. 21 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు మాత్రమే రుణం లభిస్తుంది. 

చివరిగా..

రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేవారు, గృహరుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకునే ముందే ఇతర రుణాలను పూర్తిగా చెల్లించడం మేలు. అలాగే, మీ నెలవారీ ఖర్చులను లెక్కించి ఈఎంఐ కోసం ఎంత చెల్లించగలరో చూసుకోండి. అలాగే, అత్యవసర నిధిలో రెండు నుంచి మూడు నెలల గృహ రుణ ఈఎంఐలను చేర్చండి. అప్పుడే ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఈఎంఐలను సక్రమంగా చెల్లించగలుగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని