Currency notes: చిరిగిన నోట్లను బ్యాంకులు నిరాకరించొచ్చా? ఆర్‌బీఐ నిబంధనలేం చెబుతున్నాయ్‌?

Damaged currency notes: అలాంటి నోట్లను ఏదైనా బ్యాంక్ శాఖ లేదా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) శాఖల ద్వారా అవి నకిలీ కాదనే షరతుతో మార్చుకునే వెసులుబాటు ఉంది.

Published : 05 Jul 2022 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ ఇంట్లో చిరిగిన, రంగులు అంటిన నోట్లు ఉన్నాయా? అయితే, అవి పనికిరావని అనుకోవద్దు. అలాంటి నోట్లను ఏదైనా బ్యాంక్ శాఖ లేదా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) శాఖల ద్వారా అవి నకిలీ కాదనే షరతుతో మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, మతపరమైన లేదా రాజకీయ నినాదాలు రాసి ఉన్న నోట్లను మాత్రం మార్చుకోవడం సాధ్యం కాదు. అలాగే కో-ఆపరేటివ్ బ్యాంకు శాఖలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనూ (RRB) చిరిగిన నోట్లను మార్చుకోవడానికి అవకాశం లేదు.

చెదిరిన (soiled) కరెన్సీ నోటు అంటే..?

నిరంతర వినియోగం కారణంగా మురికిగా మారిన నోటు, కీలక ఫీచర్లు చెక్కుచెదరకుండా ఉండే రెండు-ముక్కల టేప్ అంటించిన కరెన్సీ నోటుని చెదిరిన నోటుగా పరిగణిస్తారు. నోట్ల రంగు మారడం, చిల్లులు పడటం, పసుపు రంగులోకి మారడం, అరుగుదల వల్ల నోట్ మురికిగా మారి నలిగిపోతుంటుంది. అలాంటి కరెన్సీ నోట్లన్నీ చెదిరిన నోట్ల జాబితాలోకి వస్తాయని ఆర్‌బీఐ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి.

చిరిగిన నోటు (Mutilated currency note)

నోటులో ఒక భాగం లేకపోయినా లేదా రెండు ముక్కలుగా మారిన నోటును చిరిగిన నోటుగా పరిగణిస్తారు. మ్యుటిలేటెడ్ నోట్లను ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లలో సమర్పించవచ్చు. అలా ఇచ్చిన నోట్లను ఆర్‌బీఐ (నోట్ రీఫండ్) సవరణ నియమాలు 2018 ప్రకారం ఆమోదిస్తారు.

అసమగ్ర నోటు (Imperfect currency note).. 

  • పూర్తిగా లేదా పాక్షికంగా, తుడుచుకుపోయిన, కుంచించుకుపోయిన, తడిసిన, మార్పునకు గురైన లేదా అసంపూర్ణంగా ఉన్న ఏదైనా నగదు నోటును అసమగ్ర నోటుగా పరిగణిస్తారు. అయితే, అది మ్యుటిలేటెడ్ నోటు పరిధిలోకి మాత్రం రావొద్దు.
  • నకిలీ కాని, శుభ్రంగా ఉండి, దాని విలువను నిర్ధారించడానికి వీలుండి, పునర్‌వినియోగానికి అనుకూలంగా ఉండే నోటుని సరైన నోటు (Fit Note)గా పరిగణిస్తారు.
  • పునర్‌వినియోగానికి అనువుగా లేని లేదా ఆర్‌బీఐ రద్దు చేసిన నోట్లను పనికిరాని నోటు (Unfit Note)గా వ్యవహరిస్తారు.

బ్యాంకులు ఈ నోట్లను తిరస్కరిస్తే..

ఆర్‌బీఐ (నోట్ రీఫండ్) రూల్స్ 2009 ప్రకారం.. చిరిగిన, చెదిరిన, టేప్ అంటించిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి లేదా రీఫండ్ చేయడానికి ఏ బ్యాంకూ నిరాకరించడానికి వీల్లేదు. ఒకవేళ నిరాకరిస్తే వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. రూ.10,000 వరకు జరిమానాతో పాటు సంబంధిత బ్యాంకుపై చర్య తీసుకునే అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది.

నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ షరతులు... 

  • నోట్ల ముఖ విలువ, వాటిపై చెదరని ఫీచర్లు లేదా లేబుళ్ల ఆధారంగా ఒక నోటు మార్పిడికి ఎంత చెల్లించాలనే దాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు, 109.56 చదరపు సెం.మీ విస్తీర్ణం కలిగిన రూ.2,000 నోటును తీసుకుంటే.. 44 చదరపు సెం.మీ కలిగిన రూ.2,000 నోటుకు రూ.1000 రీఫండ్‌ వస్తుంది. అదే 88 చదరపు సెం.మీ కలిగిన నోటును పూర్తి విలువతో మార్చుకోవచ్చు. అదేవిధంగా, చిరిగిన రూ.200 బ్యాంక్ నోట్‌లో 78 చదరపు సెం.మీ భాగానికి మొత్తం విలువను అందజేస్తారు. అదే 39 చదరపు సెం.మీ నోటుకు రూ.100 చెల్లిస్తారు.
  • చాలా పెళుసుగా ఉన్న లేదా కాలిపోయిన, చెదిరిన, అతికించడానికి వీల్లేకుండా ఉన్న కరెన్సీ నోట్ల మార్పిడి వసతి బ్యాంకు శాఖల వద్ద ఉండదు. దానికోసం ఆర్‌బీఐ జారీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఉద్దేశపూర్వకంగా చింపిన, కత్తిరించిన, మార్పులు చేసిన లేదా తారుమారు చేసిన బ్యాంక్ నోట్లను తిరస్కరిస్తారు. అటువంటి వాటికి ఎలాంటి చెల్లింపులూ ఉండవు.

నోట్లను కాగితంతో చేస్తారా?

భారతదేశంలో కాగితం లాంటి నోట్లను 100 శాతం పత్తిని ఉపయోగించి తయారు చేస్తారని ఆర్‌బీఐ నిబంధనలు తెలియజేస్తున్నాయి. నాణ్యమైన పత్తి అంత సులభంగా చిరిగిపోదు. నోట్లు ఎక్కువ కాలం ఉండేలా 75 శాతం పత్తి, 25 శాతం లినెన్‌ కలిసిన జెలిటిన్ మిశ్రమంతో కరెన్సీ నోట్లను తయారు చేస్తారు.

దృష్టిలోపం ఉన్నవారు నోట్లను ఎలా గుర్తించడం?

దృష్టిలోపం ఉన్నవారు మనీ (MANI) (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్) అనే అప్లికేషన్‌ని ఉపయోగించి నోటు విలువను గుర్తించవచ్చు. వివిధ కోణాల్లో నోటును పట్టుకోవడం, పలు కాంతి తీవ్రతలో (సాధారణ కాంతి/పగటి/తక్కువ వెలుతురు మొదలైనవి), సగానికి మడతపెట్టిన నోట్లతో సహా నోటు ముందు లేదా వెనుక భాగాన్ని తనిఖీ చేయడం ద్వారా బ్యాంకు నోట్ల విలువలను గుర్తించడంలో ఈ యాప్‌ సహాయపడుతుంది. అయితే, నోటు నకిలీదా లేదా నిజమైనదా అన్నది మాత్రం తేల్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని