Updated ITR: ఏదైనా ఆదాయం మర్చిపోయారా.. ఐటీఆర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు!

ఈ ఏడాది నుంచి ఐటీఆర్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా ఆదాయం చేర్చాలనుకుంటే.. దానికి చెల్లించే పన్నుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది....

Updated : 23 Aug 2022 11:49 IST

Updated ITR: ఆదాయ పన్ను రిటర్ను పత్రాల్లో పలు మార్పులు చేసిన ఆదాయపు పన్ను విభాగం ఈసారి కొత్తగా ఐటీఆర్‌-యూ (ITR-U) ఫారాన్ని ప్రవేశపెట్టింది. అంటే కొత్త వివరాలతో అప్‌డేట్‌ చేసిన రిటర్నులను మరోసారి సమర్పించేందుకు అవకాశం కల్పించింది. దీన్నే అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ (Updated ITR)గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు మార్పులు చేస్తూ ‘కేంద్ర బడ్జెట్‌ 2022’లో ప్రకటన చేశారు.

ఏంటీ అప్‌డేటెడ్‌ రిటర్నులు?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 139 (8ఏ) ప్రకారం అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ (Updated ITR)ను సమర్పించే అవకాశం కల్పించారు. అదనపు పన్నులు చెల్లించినప్పుడు, ఏవైనా తప్పులు దొర్లినా, పొరపాటున ఏదైనా ఆదాయాన్ని పేర్కొనడం మర్చిపోయినా.. ఈ ఐటీఆర్‌-యూ ఫారంతో అప్‌డేటెడ్‌ రిటర్నులను దాఖలు చేయొచ్చు.

ఎవరు దాఖలు చేయొచ్చు..

ఇప్పటికే ఐటీఆర్‌ దాఖలు చేసినవారు, ఆలస్యపు ఐటీఆర్‌ సమర్పించిన వారితో సహా రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసినవారు అవసరమైతే అప్‌డేటెడ్‌ రిటర్నులను సమర్పించేందుకు అవకాశం ఉంది. కొత్త వివరాలతో కూడిన ఐటీఆర్‌-యూను దాఖలు చేయొచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పాటు తర్వాతి సమీక్షా ఏడాదికి అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించొచ్చు. అయితే, ఒక సమీక్షా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఐటీఆర్‌ను అప్‌టేడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఎంత గడువు?

2022 ఏప్రిల్‌ 1 నుంచి ఐటీఆర్‌-యూ సమర్పించేందుకు గడువు ప్రారంభమైంది. సమీక్షా సంవత్సరం ముగిసిన దగ్గరి నుంచి 24 నెలల్లోపు ఐటీఆర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2020-21, 2021-22 సమీక్షా సంవత్సరాలకు అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ను ఫైల్‌ చేసుకోవచ్చు.

ఒకవేళ అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే అదనపు ఆదాయంపై చెల్లించాల్సిన పన్నుకు వడ్డీ వర్తిస్తుంది. 12 నెలల్లోగా ఐటీఆర్‌-యూ దాఖలు చేస్తే 25 శాతం, 24 నెలల్లోపు సమర్పిస్తే 50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2019-20 సమీక్షా సంవత్సరానికి ఇప్పుడెవరైనా ఐటీఆర్‌ను అప్‌డేట్‌ చేయాలనుకుంటే.. కొత్త ఆదాయంపై పన్నుతో పాటు దానిపై 50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి వివరాలు పొందుపర్చాలి?

ఎయే మార్గాల ద్వారా కొత్త ఆదాయాన్ని ఆర్జించారో దాన్ని మాత్రమే ఐటీఆర్‌-యూలో పొందుపరిస్తే సరిపోతుంది. సాధారణ ఐటీఆర్‌లో పేర్కొన్నట్లుగా ప్రతి ఆదాయమార్గ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. పాన్‌, ఆధార్‌, చిరునామా వంటి వివరాలతో పాటు ఐటీఆర్‌ను అప్‌డేట్‌ చేయడానికి గల కారణాన్ని నిర్ధిష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.

ఎవరు చేయొద్దు?

ఒక సమీక్షా సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ దాఖలు చేసిన వ్యక్తిపై ఐటీ విభాగం తనిఖీ లేదా సర్వే లేదా విచారణ ప్రక్రియ ప్రారంభిస్తే.. వారు అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే కొత్తగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా.. ఐటీఆర్‌ అప్‌డేట్‌ చేయనక్కర్లేదు. ఒకవేళ గత రిటర్నులతో పోలిస్తే పన్ను తగ్గుతుందనుకున్నా.. ఆదాయంలో నష్టం వాటిల్లినా, రీఫండ్‌ పెరిగే అవకాశం ఉందని భావించినా.. ఐటీఆర్‌-యూ సమర్పించడానికి అవకాశం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు