NBFCల నుండి తీసుకున్న విద్యా రుణాల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రా ?

విద్యార్ధులు త‌క్ష‌ణ రుణ ఆమోదం కోసం NBFCల వైపు ఆక‌ర్షితుల‌వుతారు.

Updated : 18 May 2022 16:58 IST

ప్ర‌స్తుత కాలంలో మంచి భ‌విష్య‌త్తుకై విద్యా రంగాన్ని ఎవ‌రూ విస్మ‌రించ‌డం లేదు. చ‌దువుపై ఆస‌క్తి యువ‌తీ, యువ‌కుల‌కు బాగా పెరిగింద‌ని విద్యారంగ గ‌ణాంకాలు చెబుతున్నాయి. అనేక ప్రొఫెష‌న‌ల్ కోర్సులు, సాంకేతిక కోర్సులు విద్యార్ధుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. విద్య‌లో ప్రైవేట్ రంగ పాత్ర కూడా బాగా పెరిగింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఫీజుల భారం కూడా విద్యార్ధుల‌కు బాగా పెరిగింది. అయితే ఫీజుల భారాన్ని మోయ‌డానికి విద్యా రుణాలు తీసుకోవాలంటే రుణ సంస్థ‌ల‌ను ఆశ్ర‌యించాలి. రుణాలు తీసుకోవ‌డానికి  బ్యాంకుల వ‌ద్ద తీసుకోవాలా (లేక) NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీ)ల వ‌ద్ద తీసుకోవాలా అనేది నిర్ణ‌యించుకోవాలి.

విద్యార్ధులు త‌క్ష‌ణ రుణ ఆమోదం కోసం NBFCల వైపు ఆక‌ర్షితుల‌వుతారు. వారిలో చాలామంది ప్రీ-అడ్మిష‌న్ రుణ మంజూరు లెట‌ర్‌ల‌ను అందిస్తారు. ఇది NBFCలకు ప్ర‌త్యేక‌మైనది. అయితే భార‌త ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80ఈ కింద NBFCల నుండి వ‌చ్చే విద్యా రుణాలు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హ‌త పొంద‌వు.  ప‌న్ను మిన‌హాయింపును పొందేందుకు సెంట్ర‌ల్ బోర్డ్ ఆప్ డైర‌క్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా తెలియ‌చేయ‌బ‌డిన ఆర్ధిక సంస్థ నుండి విద్యా రుణాన్ని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు జాతీయ బ్యాంకులు, `హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా` నుండి తీసుకునే రుణాల‌పై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. స్వ‌యం లేదా జీవిత భాగ‌స్వామి లేదా పిల్ల‌లు కోసం ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో చెల్లించిన వ‌డ్డీని ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ `80 ఇ` కింద ప‌న్ను మిన‌హాయింపుగా పొంద‌వ‌చ్చు. ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన మొత్తం వ‌డ్డీని ప‌న్ను మిన‌హాయింపుగా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

కానీ NBFCల‌లో విద్యా రుణాలు తీసుకున్న‌వారికి ప‌న్ను మిన‌హాయింపు అనుమ‌తించ‌బ‌డ‌దు. రుణ గ్ర‌హీత‌లు రుణం కోసం NBFCల‌కు ధ‌ర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు వారు ప‌న్ను మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌లేర‌నే వాస్త‌వాన్ని తెలుసుకోవాలి. ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థ‌లు త‌మ ఫీజుల లాభార్జన‌కై NBFCల నుండి రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సిఫార్సు చేస్తాయి. రుణ‌గ్ర‌హీత‌లు NBFCల‌తో రుణాల‌కై జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించాలి. 

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుండి సుర‌క్షిత‌మైన విద్యా రుణాన్ని ఎంచుకోవ‌చ్చు. ఈ రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుం, ఎక్కువ మార‌టోరియం (రుణం తీర్చ‌డానికి) వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటాయి. వినియోగ‌దారుల‌కు ఇటువంటి రుణాలే ల‌బ్దిని చేకూర్చ‌గ‌ల‌వు. కేంద్ర రంగ వ‌డ్డీ రాయితీ ప‌థ‌కం కింద వ‌డ్డీ రాయితీ అద‌న‌పు ప్ర‌యోజ‌నంగా ఉంటుంది. ఇది బ్యాంకుల నుండి వ‌చ్చే విద్యా రుణాల‌పై మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

అయితే NBFCల‌తో ఈ స్ప‌ష్ట‌మైన ప‌న్ను మిన‌హాయింపు లోపం ఉన్న‌ప్ప‌టికీ మార్కెట్‌లో పెద్ద వాటాను, ఆధిప‌త్యం చెలాయిస్తున్నాయి. సాంప్ర‌దాయ బ్యాంకుల క‌న్నా వినియోగ‌దారుల‌ను ఎక్కువ ఆక‌ర్షిస్తున్నాయి. దీనికి కార‌ణం త్వ‌రిత డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ‌, త‌క్ష‌ణ ఆమోదంతో NBFCల నుండి సుల‌భ‌మైన‌, వేగ‌వంత‌మైన‌, విభిన్న‌మైన ఫైనాన్సింగ్ ఎంపిక‌లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ ప్ర‌త్యేక‌త‌ల‌న్నీ విద్యార్ధుల‌ను రుణం కోసం NBFCల వ‌ద్ద‌కు ప‌రుగెత్తేలా చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని