Home Loan: పీఎఫ్‌ డబ్బుతో హోంలోన్‌ చెల్లిస్తే?

వడ్డీరేట్లు పెరిగిన నేపథ్యంలో చాలా మంది గృహరుణాన్ని చెల్లించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. మరి పీఎఫ్ డబ్బును అందుకు వాడుకోవచ్చా? లేదా? చూద్దాం..

Updated : 11 Jan 2023 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ వరుసగా ఐదుసార్లు రెపో రేటు పెంచడంతో గృహ రుణ (Home Loan) వడ్డీరేట్లు ఎగబాకాయి. దీంతో నెలవారీ వాయిదాలు (EMI) పెరిగిపోయాయి. ఈ భారాన్ని ఎలా దించుకోవాలని రుణగ్రహీతలు ఆలోచిస్తున్నారు. ఉద్యోగ భవిష్య నిధి (EPF) డబ్బుతో లోన్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించాలని భావిస్తున్న వేతన జీవులూ ఉన్నారు.

హోంలోన్‌కు పీఎఫ్‌ డబ్బు వాడుకోవచ్చా?

ఈపీఎఫ్‌ పథకం (EPF Scheme)లోని సెక్షన్‌ 68బీబీ ప్రకారం.. పీఎఫ్‌ (EPF) సొమ్మును గృహరుణ (Home Loan) చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. అయితే, పీఎఫ్‌ ఖాతాదారుడి పేరుమీద ఇల్లు రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ ఉమ్మడి రిజిస్ట్రేషన్‌ అయితే, అందులో ఒక సభ్యుడిగానైనా ఉండాలి. కనీసం పదేళ్ల నుంచి పీఎఫ్‌లో జమచేస్తూ ఉండాలి. అయితే, రుణ చెల్లింపు కోసం ఉన్న ఇతర మార్గాలను కూడా పరిగణనలోకి తీసుకొని.. ఏది లాభదాయకంగా ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చెల్లించాలా? వద్దా?

హోంలోన్‌ను చెల్లించడానికి పీఎఫ్‌ నిధిని వాడుకునే ముందు అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఒకవేళ కేరీర్‌ ఆరంభంలో అంటే మీ వయసు 30 ఏళ్లకు కాస్త అటుఇటుగా ఉంటే నిస్సందేహంగా పీఎఫ్‌ సొమ్మును వాడుకోవచ్చన్నది ఆర్థిక నిపుణుల సూచన. రిటైర్‌మెంట్‌ జీవితానికి కావాల్సిన నిధుల్ని తిరిగి పోగు చేసుకునేందుకు చాలినంత సమయం ఉంటుంది. ఒకవేళ పీఎఫ్‌పై వస్తున్న వడ్డీరేటు కంటే హోంలోన్ రుణ రేటు ఎక్కువ ఉంటే పీఎఫ్‌ సొమ్మును రుణ చెల్లింపు కోసం వినియోగించుకునే అంశాన్ని పరిశీలించొచ్చు. అదే రెండు రేట్లు సమానంగా ఉన్నా.. లేదా పీఎఫ్‌పై వస్తున్న రేటు లోన్‌ రేటు కంటే ఎక్కువ ఉన్నా.. పీఎఫ్‌ నిధిని కదిలించకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

పీఎఫ్‌ నిధిని ఎప్పుడు వాడుకోవాలి?

ఒక్క హోంలోన్‌కే కాదు.. ఇతర ఏ సందర్భాల్లోనైనా పీఎఫ్‌ సొమ్మును వాడుకోవడం అనేది చివరి ప్రత్యామ్నాయంగానే పెట్టుకోవాలి. పీఎఫ్‌ ప్రధాన లక్ష్యం రిటైర్‌మెంట్‌ తర్వాత జీవిత ఖర్చులు. అందుకే దాన్ని సురక్షితంగా కాపాడుకోవాలి. ఒకవేళ జీవితంలో తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టిముట్టి.. సమీప భవిష్యత్తులో బయటకు రాలేని స్థితి ఉంటే పీఎఫ్‌ సొమ్ము ఉపసంహరణ గురించి ఆలోచించాలి. అది కూడా పీఎఫ్‌ నిధుల వల్ల మీ కష్టాలు తొలగిపోతాయన్న నమ్మకం ఉంటేనే. అంతకంటే ముందు ఎఫ్‌డీలు, ఈక్విటీ, బంగారంలో పెట్టుబడులు.. వీటన్నింటినీ వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. వీటి తర్వాతే పీఎఫ్‌ ఆప్షన్‌కు వెళ్లాలని నిపుణుల సూచన.

పీఎఫ్‌తో హోంలోన్‌ చెల్లిస్తే ప్రయోజనం ఏంటి?

ఒకవేళ పీఎఫ్‌ డబ్బుల్ని తీసుకొని హోంలోన్‌ చెల్లించారనుకుందాం. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది గృహరుణం దీర్ఘకాలికం గనుక పెద్ద ఎత్తున వడ్డీ చెల్లిస్తాం. ఆ భారం తగ్గుతుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ విలువ వేగంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఇంటి విలువ పీఎఫ్‌ రాబడి కంటే అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే అద్దె ఆదాయాన్ని రుణం చెల్లించడానికి బదులు ఇంకా అధిక రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, కాంపౌండింగ్‌ ప్రభావం వల్ల పీఎఫ్‌ సొమ్ము రిటైర్‌మెంట్‌ నాటికి భారీ ఎత్తున పెరుగుతుంది. మీ ఇతర పెట్టుబడి మార్గాలు దానికంటే ఎక్కువ రాబడిని ఇస్తాయనుకుంటేనే పీఎఫ్‌ సొమ్మును మధ్యలో ఉపసంహరించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని