Credit card: క్రెడిట్‌ కార్డు బకాయిలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చా?

క్రెడిట్‌ కార్డు బకాయిని ఒకేసారి తీర్చలేని సందర్భంలో, బకాయి చెల్లింపుల గడువుకు ముందే ఆ మొత్తాన్ని క్రెడిట్‌ కార్డు సంస్థల సూచనపై ఈఎంఐలుగా ఎలా మార్చుకోవచ్చొ ఇక్కడ చూడండి.

Published : 15 Feb 2023 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్రెడిట్‌ కార్డు (Credit card).. వస్తువులను కొనుగోలు చేయడానికి, ఆన్‌లైన్‌ చెల్లింపులకే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే అధిక వడ్డీని చెల్లించకుండా, క్రెడిట్‌ స్కోరును సరిగ్గా నిర్వహించడానికి మీ క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో తిరిగి చెల్లించాలి. క్రెడిట్‌ కార్డు బిల్లు జనరేట్‌ అయినప్పుడు ఆలస్యపు ఛార్జీలను నివారించడానికి బకాయి మొత్తం, కనీస మొత్తాన్ని చెల్లించడానికి లేదా మొత్తం బిల్లును ఈఎంఐలుగా (EMI) మార్చుకోవడానికీ అనుమతి ఉంటుంది.

ఈఎంఐల ఎంపిక

మీ క్రెడిట్‌ కార్డు బిల్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు వినియోగదారులు తమ బిల్లులను గడువు తేదీకి ముందే తిరిగి చెల్లించలేకపోయిన సందర్భంలో క్రెడిట్‌ కార్డు జారీచేసేవారు తమ మొత్తం బిల్లును లేదా దానిలో కొంత భాగాన్ని సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు)గా సౌకర్యవంతంగా చెల్లించడానికి అనుమతిస్తారు. పెద్ద మొత్తంలో క్రెడిట్‌ కార్డు బకాయికు సంబంధించిన రీపేమెంట్‌ సామర్థ్యం లేనివారు కూడా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. బకాయి మొత్తం చిన్న ఈఎంఐలుగా విభజన జరుగుతుంది. ఈఎంఐలను ఎంచుకున్న కాలవ్యవధి ప్రకారం తిరిగి చెల్లించవచ్చు. ఈఎంఐ ఎంపిక వడ్డీతో వస్తుంది. అందుకు వడ్డీ 15-24% వరకు ఉండొచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం అసౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఎంచుకోండి. అలాగే మీ కొనుగోళ్లన్నింటినీ ఈఎంఐలుగా మార్చడం అలవాటు చేసుకోవద్దు. ఒక్కోసారి బకాయి మొత్తంలో కొంత భాగాన్ని కూడా ఈఎంఐగా మార్చుకోవచ్చు.

నో కాస్ట్‌ ఈఎంఐలు

వ్యాపారుల ద్వారా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తరచుగా మీకు ‘నో కాస్ట్‌ ఈఎంఐ’ను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద మొత్తాన్ని చిన్న ఈఎంఐలలో తిరిగి చెల్లించడం వల్ల ఈ ఎంపిక లాభదాయకంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన కాలవ్యవధి 3 నెలల నుంచి 12 నెలల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. అయితే హిడెన్ ఛార్జీలు, అదనపు ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

డాక్యుమెంటేషన్‌ అక్కర్లేదు

క్రెడిట్‌ కార్డు ద్వారా ఎలాంటి డాక్యుమెంటేషన్‌ లేకుండా రుణం తీసుకోవడం సులభం. అదేవిధంగా, ఎలాంటి డాక్యుమెంటేషన్‌ లేకుండానే బకాయి మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. అనేక బ్యాంకులు/సంస్థలు కొనుగోలు సమయంలో మీకు ఈ ఎంపికను అందిస్తారు.

కార్డు వినియోగ పరిమితి

మీ క్రెడిట్‌ కార్డు వినియోగం గరిష్ఠంగా 30% ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అది మీ క్రెడిట్‌ స్కోరుకు అంత మంచిది. అయితే అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు, మీరు ఈ నియమాన్ని అనుసరించలేరు. వైద్యం, విద్య, వివాహం మొదలైన అత్యవసర పరిస్థితులు, అవసరాలు మీ క్రెడిట్‌ కార్డు బిల్లును పెంచుతాయి. అప్పుడప్పుడు ఈ క్రెడిట్‌ పరిమితిని దాటొచ్చు. ఇది స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడం మంచిది. లేదా ఈ బిల్లు మొత్తాన్ని కార్డు ప్రొవైడర్ల సూచనతో ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

క్రెడిట్‌ పరిమితి

బకాయిని ఈఎంఐల్లో చెల్లించాలనుకున్నప్పుడు బకాయి మొత్తాన్ని బట్టి మీ క్రెడిట్‌ పరిమితి తగ్గుతుంది. అయితే, మీరు ఈఎంఐలలో బిల్లును తిరిగి చెల్లించేకొద్దీ మీ చెల్లింపు మొత్తాన్ని బట్టి క్రెడిట్‌ కార్డు పరిమితి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ క్రెడిట్‌ పరిమితిని ట్రాక్‌ చేయండి. బకాయిలను క్లియర్‌ చేసేవరకు అధిక కొనుగోళ్లను నివారించాలి.

కనీస చెల్లింపులు

క్రెడిడ్‌ కార్డు వాడేటప్పుడు బకాయి బిల్లు సరైన వ్యవధిలో చెల్లించడం చాలా ముఖ్యం. క్రెడిట్‌ కార్డు బిల్లును చెల్లించేందుకు వడ్డీ రహిత కాలవ్యవధి ఉంటుంది. ఈ లోపు పూర్తి బిల్లును చెల్లిస్తే మంచిదే. లేకుంటే బకాయికి జరిమానా పడుతుంది. పూర్తి బిల్లును చెల్లించలేనివారు కనీసం 5% బిల్లును చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత నెలకు బదిలీ చేసుకోవచ్చు. కానీ, ఆ 95% బకాయికి వడ్డీ పడుతుందని గమనించాలి. అందుచేత ప్రతిసారీ 5% కనీస బిల్లును చెల్లించుకుంటూ వెళితే మీరు వేగంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. ఒకవేళ కనీసం చెల్లించాల్సిన 5% బిల్లును కూడా సకాలంలో చెల్లించకపోతే వడ్డీ, పన్నులతో పాటు ఆలస్య రుసుములను క్రెడిట్‌ కార్డు సంస్థలు వసూలు చేస్తాయి. ఈ పరిస్థితి అధిగమించడానికి బకాయిని ఈఎంఐలుగా మార్చుకోవడం మంచిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని