ఇంధన రకం ఆధారంగా బీమా ప్రీమియం మారుతుందా?

ఇంధన రకం ఆధారంగా వాహన బీమా ప్రీమియంలో కూడా తేడాలు ఉంటాయి

Published : 20 Dec 2020 17:15 IST

వ్యక్తిగత, డ్రైవింగ్ అవసరాల కోసం ఎక్కువ కాలం వాహనం వినియోగించాలనుకునే వారు ఎలాంటి ఇంధన రకానికి చెందిన వాహనం మంచిదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వాహనంలో వినియోగించే ఇంధన రకం ఆధారంగా వాహన ధరల్లో వ్యతాసాలు ఉంటాయన్న విషయం బహుశా కొంత మందికి తెలియకపోవచ్చు. ఇంధన రకం ఆధారంగా వాహన బీమా ప్రీమియంలో కూడా తేడాలు ఉంటాయి. అలాగే వాహన క్యూబిక్ సామర్థ్యం, ఇతర కారకాల ఆధారంగా కూడా వాహన ధరల్లో వ్యతాసాన్ని మనం గమనించవచ్చు.

సాధారణంగా మనం ఉపయోగించే పెట్రోల్ వాహనాల బీమా ప్రీమియం, డీజిల్/సీఏన్జీ వాహనాల బీమా ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. డీజిల్/సీఏన్జీ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధర కంటే ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. సీఏన్జీ అమర్చిన వాహనాలకు అధిక ఇన్స్టాలేషన్ ఖర్చుతో పాటు అధిక నిర్వహణ ఖర్చు అవసరమవుతుంది. ఒకవేళ మీ వాహనానికి సీఏన్జీ కిట్టును అమర్చాలని భావించినట్లైతే మీరు వెంటనే మీ మోటార్ బీమా పాలసీని అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది.

ఒకవేళ మీరు సీఏన్జీ కవరేజ్ కావాలనుకుంటే కింద తెలిపిన రెండిటిలో ఒకటి ఎంచుకోవచ్చు.

  1. పాత కారులో సీఏన్జీ కిట్టును ఏర్పాటు చేసుకోవడం

  2. సీఏన్జీ కిట్టుతో తయారైన వాహనాన్ని కొనడం

  3. పాత కారులో సీఏన్జీ కిట్టును ఏర్పాటు చేసుకోవడం

ఒకవేళ మీ పాత కారులో సీఏన్జీ కిట్టును ఏర్పాటు చేసుకోవాలని భావించినట్లైతే ముందుగా ఆ విషయాన్ని మీ బీమా సంస్థకు తెలియచేయాలి. ఎందుకంటే అప్పటికే మీ కారు సీఏన్జీ రహిత మోటార్ భీమా పాలసీ పరిధిలో ఉంటుంది. సీఏన్జీ కిట్టు అమర్చినందుకుగాను బీమా సంస్థకి విడిగా బీమా చెల్లించవలసి ఉంటుంది. అలాగే సీఏన్జీ కిట్టు అమర్చిన విషయాన్ని రిజిస్ట్రేషన్ పత్రంలో కూడా అప్ డేట్ చేయించాలి.

ఇంకో విషయం ఏంటంటే గుర్తింపు పొందిన వర్క్ షాప్ ద్వారా మాత్రమే మీ కారులో సీఏన్జీ కిట్టును అమర్చుకోవాలి. ఇలా చేయడం వలన కారు బీమా అప్ డేట్ చేయించే సమయంలో బీమా సంస్థలు కారుకు నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు. పైన తెలిపిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోకపోయినట్లైతే తరువాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. భవిష్యత్తులో మీకు ఎలాంటి క్లెయిమ్స్ ను మీ బీమా సంస్థ అందించదు. ఎందుకంటే పెట్రోల్/ డీజిల్ తో నడిచే కార్ల కన్నా సీఏన్జీ తో నడిచే కార్లకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

  1. సీఏన్జీ కిట్టుతో తయారైన వాహనాన్ని కొనడం

సీఏన్జీ కిట్టుతో తయారైన వాహనానికి బీమా చేయించడం చాలా తేలికైన విషయం. సాధారణంగా పెట్రోల్/ డీజిల్ వాహనాలకు ఎలాగైతే బీమా చేయిస్తామో అదే విధంగా సీఏన్జీ కిట్టుతో తయారైన వాహనానికి బీమా చేయిస్తాము. ఎందుకంటే సీఏన్జీ కిట్టును వాహనాన్ని తయారు చేసిన సంస్థే అమర్చడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని బీమా సంస్థలు భావిస్తాయి. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో సీఏన్జీ ఇంధనంతో నడిచే వాహనమని పొందుపరిచారో లేదో చూడాలి.

బీమా ప్రీమియంపై ప్రభావం…

మోటార్ బీమా ప్రీమియం అనేది ముఖ్యంగా వాహన విలువ, వాహన క్యూబిక్ సామర్ధ్యం, ఇంధన రకం అలాగే మరికొన్ని వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంధన రకంలోని వ్యత్యాసం గురించి మాట్లాడుకున్నట్లైతే సీఏన్జీ కిట్టుతో తయారైన వాహనానికి చెల్లించే బీమా ప్రీమియం, పెట్రోల్/ డీజిల్ వాహనాలకు చెల్లించే బీమా ప్రీమియం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ పాత కారులో సీఏన్జీ కిట్టు అమర్చబడి ఉంటే దీనికి చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

ఇండియన్ మోటార్ టారిఫ్ ప్రకారం సీఏన్జీ కిట్టు అమర్చబడిన పాత కారుకు థర్డ్ పార్టీ బీమా చేసేందుకు అదనంగా రూ.60 చెల్లించవలసి ఉంటుంది. అలాగే మన సొంత తప్పిదం వలన కలిగే నష్టానికి కట్టవలసిన ప్రీమియం ఒక్కో బీమా సంస్థకు ఒక్కోలా ఉంటుంది. అంటే మీ సీఏన్జీ కిట్టు విలువలో 4% గా ఉండవచ్చు.

ఉదాహరణకు ఒక మంచి సీఏన్జీ కిట్టు విలువ రూ.50000 అనుకుంటే మీ వాహనానికి బీమా చేసే వ్యక్తి సీఏన్జీ కిట్టు విలువలో 4% ప్రీమియంను ఎక్కువగా చెల్లించాలని కోరతాడు. అప్పుడు మీరు అదనంగా రూ.2000 చెల్లించవలసి ఉంటుంది. సీఏన్జీ వాహనం కొనడం లేదా పాత కారుకు సీఏన్జీ కిట్టు అమర్చడమనేది తెలివైన ఆలోచనైనప్పటికీ భవిష్యత్తులో మీ జేబుకు చిల్లు పడటం మాత్రం కాయం. కానీ సీఏన్జీ వాహనం పర్యావరణానికి చాలా అనుకూలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని