కారు రుణాలు

సొంత వాహనం కలిగి ఉండడం వలన అనుకున్నప్పుడు వీలుగా ప్రయాణం చెయ్యవచ్చు, వారాంతంలో కుటుంబంతో సరదాగా ఊరు చుట్టేయొచ్చు. ఆర్థికంగా భారం కాకుండా సులభ వాయిదాల్లో చెల్లించేలా కారు రుణాలు పొంద‌వ‌చ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు

Published : 15 Dec 2020 19:50 IST

కారు కొనేందుకు రుణం ఎలా పొందాలో తెలుసుకుందాం

సొంత వాహనం కలిగి ఉండడం వలన అనుకున్నప్పుడు వీలుగా ప్రయాణం చెయ్యవచ్చు, వారాంతంలో కుటుంబంతో సరదాగా ఊరు చుట్టేయొచ్చు. ఆర్థికంగా భారం కాకుండా సులభ వాయిదాల్లో చెల్లించేలా కారు రుణాలు పొంద‌వ‌చ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కారు రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి.

రెండు రకాల కారు లోన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

* కొత్త కారు కొనుగోలుకు - రుణంపై కొత్త కారు కొనాలనుకునే వారి కోసం బ్యాంకులు ఇవి అందిస్తున్నాయి.
* ప్రీ ఓన్డ్‌ కారు కొనుగోలుకు - ప్రీ ఓన్డ్ (పాత‌) కారు కొనుగోలు చేసేవారి కోసం ఇటువంటి రుణాన్ని అందిస్తారు. కార్లను పరిశీలించే వాల్యూయర్లు కొన‌బోయే వాహ‌నాన్ని ప‌రిశీలిస్తారు.
కారు రుణం పొందేందుకు అర్హత:
* రుణగ్రహీత వయసు 18−65ఏళ్ల మధ్య ఉండాలి.
* వార్షిక ఆదాయం రూ. 2.4లక్షలు ఆ పైన ఉండాలి.
* రుణ పరిమితి
* కారు ఖరీదు, రకాన్ని బట్టి రుణ పరిమితి ఉంటుంది.
* కొత్త కారుకు 90శాతం వరకు రుణం ఇస్తారు.
* పాత కార్లకు తక్కువ రుణం ఇస్తారు.
అవసరమైన పత్రాలు :
ఉద్యోగం చేస్తూ వేతనం అందుకుంటుంటే :
* పే స్లిప్‌ లేదా వేతన పత్రం
* టీడీఎస్‌ పత్రం కోసం ఫారం 16ను సమర్పించాలి.
* రుణాన్ని ఉమ్మడిగా కలిపి తీసుకుంటే భాగస్వామి కూడా ఇవే పత్రాలు జతచేయాలి.
స్వయం ఉపాధి పొందుతుంటే:
* గడిచిన రెండేళ్ల ఆడిట్‌ వివరాలు,
* బిజినెస్‌ ట్రాక్‌ రికార్డు…
వీటికి అదనంగా..
* గడచిన ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు
* క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌
* కేవైసీ, ఫొటో, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా పత్రాలు
ఆమోదం పొందాక:
రుణం పొందేందుకు ఆమోదం వచ్చాక సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు

*కారు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ బుక్‌) కాపీ
* బీమా పాలసీ కాపీ
* రహదారి పన్ను చెల్లించిన పత్రాలు
రుణం అందించే బ్యాంకుకు అనుకూలంగా ‘హైపోతికేషన్‌ క్లాజ్‌’ (రుణం చెల్లించే వరకూ హామీ లాంటిది) ను ఆర్‌సీ బుక్‌లో చేర్చాల్సి ఉంటుంది. రుణం మొత్తం చెల్లించేవరకు ఈ క్లాజ్‌ను బీమా పాలసీలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఒకసారి మొత్తం రుణం తీర్చాక బ్యాంకు నిరభ్యంతర పత్రంతోపాటు ఫారం 35ను ఇస్తుంది. ఫారం 35 ఆర్‌సీ బుక్‌లో ‘హైపోపతికేషన్‌ క్లాజ్‌’ను తొలగించేందుకు. నిరభ్యంతర పత్రం బీమా కంపెనీకి ఇస్తే వాళ్లు ఆ మేరకు బీమా పాలసీలో మార్పులు చేస్తారు.

కారు రుణ చెల్లింపు కాలం:
కారు రుణాన్ని 1 నుంచి 7 ఏళ్లలోగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్ర‌త్యామ్నాయ‌ ఆస్తుల హామీ :
రూ.5లక్షల లోపు కారు రుణాల‌కు ప్రత్యామ్నాయ ఆస్తుల హామీ అక్క‌ర్లేదు.
రుణం రూ.5లక్షలు దాటితే థర్డ్‌ పార్టీ హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
వడ్డీ రేటు:
స్థిర లేదా చ‌ర‌ వడ్డీ రేట్లను రుణానికి వర్తింపజేస్తారు. చ‌ర‌ వడ్డీ రేట్లు ఒక‌సారి తగ్గవచ్చు మరోసారి పెరగవచ్చు. స్థిర వడ్డీ రేటు రుణ కాలపరిమితి మొత్తానికి ఒకేవిధంగా ఉంటుంది.

వర్తించే ఫీజు, ఛార్జీలు:
ప్రాసెసింగ్‌ ఫీజు కింద రుణ మొత్తంలో 0.5శాతం ఛార్జీలు వ‌సూలుచేస్తారు. ఇది కనీసం రూ.500 ఉండొచ్చు. బ్యాంకును బ‌ట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుంది. ముందస్తు రుణ చెల్లింపులకు 1శాతం పెనాల్టీ ఉంటుంది.
పన్ను వర్తింపులు:
ఉద్యోగులు, వేతనాలు అందుకునే వర్గం వారికి ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. స్వయం ఉపాధి వర్గం వారికి కొత్త కారుకు తీసుకునే రుణంపైన వడ్డీరేట్లకు… ప్రీ ఓన్డ్ కారైతే తరుగుదలను బట్టి మినహాయింపులుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని