Card less cash: కార్డులేకున్నా నగదు విత్‌డ్రా.. అన్ని ATMలలో త్వరలో అందుబాటులోకి

Card-less cash withdrawal: ఏటీఎంలలో నగదు ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. డెబిట్‌ కార్డు అవసరం లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది.

Published : 08 Apr 2022 17:12 IST

ముంబయి: ఏటీఎంలలో నగదు ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. డెబిట్‌ కార్డు అవసరం లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. తమ ఏటీఎం కేంద్రాల్లో ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు అన్ని బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు మాత్రమే కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా సదుపాయం అందిస్తున్నాయి. అదీ తమ సొంత ఏటీఎంలలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

‘యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా సదుపాయం కల్పించనున్నాం. లావాదేవీలను సులభతరం చేయడంలో భాగంగా ఫిజికల్‌ కార్డు లేకున్నా నగదు ఉపసంహరించేందుకు దీని ద్వారా వీలుపడుతుంది. దీని వల్ల కార్డు స్కిమ్మింగ్‌, కార్డ్‌ క్లోనింగ్‌ వంటి మోసాలకూ చెక్‌ పడుతుంది’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించే సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్‌పీసీఐ, ఏటీఎం నెట్‌వర్కులు, బ్యాంకులకు ఈ మేరకు త్వరలోనే సూచనలు జారీ చేయనున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..?

ఇంటి నుంచి బయటకెళ్లినప్పుడు డెబిట్‌ కార్డును వెంట పట్టుకెళ్లకపోయినా.. పొరపాటున కార్డు కనిపించకుండా పోయిన సందర్భాల్లో క్యాష్‌ లెస్‌ విత్‌డ్రా సదుపాయం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ బ్యాంక్‌ యాప్స్‌ ద్వారా అందిస్తున్నాయి. క్యాష్‌లెస్‌ విత్‌డ్రా చేయాలంటే  తీయాల్సిన మొత్తం యాప్‌లో ఎంటర్‌ చేయాలి. సంబంధిత లావాదేవీకి పిన్‌ సెట్‌ చేసుకోవాలి. అప్పుడు బ్యాంక్‌ నుంచి ఓ పిన్‌ కూడా జనరేట్‌ అయ్యి మీ మొబైల్‌కు సందేశం వస్తుంది. ఈ వివరాలతో సంబంధిత ఏటీఎంకు వెళ్లి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.100 నుంచి ఒక రోజులో గరిష్ఠంగా రూ.10వేల వరకు నగదును ఉపసంహరించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని