UPI transactions: కార్డు లావాదేవీలు తగ్గించేశారు

డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేయడం ద్వారా చెల్లింపునకు వీలున్న పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలను కొత్తగా అమర్చుకునే వారి సంఖ్య బాగా నెమ్మదించింది. అన్ని రకాల చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్న వ్యవస్థీకృత, పెద్ద ఫార్మాట్‌ రిటైల్‌ సంస్థలే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి.

Published : 17 Jun 2024 02:02 IST

పీఓఎస్‌ల ఏర్పాటులోనూ నెమ్మదించిన వృద్ధి
క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు పెరగడం వల్లే

డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేయడం ద్వారా చెల్లింపునకు వీలున్న పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలను కొత్తగా అమర్చుకునే వారి సంఖ్య బాగా నెమ్మదించింది. అన్ని రకాల చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్న వ్యవస్థీకృత, పెద్ద ఫార్మాట్‌ రిటైల్‌ సంస్థలే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కిరాణా సరకుల దుకాణాలు, చిన్న స్టోర్లు, తినుబండారాల దుకాణాలు (ఈటరీస్‌), కూరగాయలు-పళ్ల విక్రయశాలల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, చెల్లింపులు చేసే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పీఓఎస్‌లను ఏర్పాటు చేయడం ప్రారంభించాక, వాటి ఏర్పాటులో వృద్ధి అత్యంత నెమ్మదిగా ఉంది ఇప్పుడేనని చెబుతున్నారు. 

ఎందుకిలా?

కార్డులతో చెల్లింపులు జరిపే వారి కోసమే పీఓఎస్‌ టెర్మినళ్లను పెద్ద సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ల చెల్లింపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో మాత్రం చిన్న దుకాణాలూ పీఓఎస్‌లు అమర్చుకుంటున్నాయి. అయితే చెల్లింపులకు యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌ సౌకర్యవంతంగా ఉండటంతో వ్యాపారులు, వినియోగదార్లు నగదు రహిత లావాదేవీల కోసం క్యూఆర్‌ కోడ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో కార్డు స్వైపింగ్‌ ద్వారా చెల్లింపులు మునుపటితో పోలిస్తే తగ్గాయని చెబుతున్నారు. 

2023-24లో చాలా తక్కువగా..

పెద్ద నోట్ల రద్దు (2016) తర్వాత చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పీఓఎస్‌ల ఏర్పాటు చాలా తక్కువగా నమోదైందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డేటా వెల్లడించింది. కొవిడ్‌-19 వ్యాప్తి, తదనంతర లాక్‌డౌన్‌ పరిణామాలతో సంప్రదాయ దుకాణాల్లో వ్యాపారం దారుణంగా దెబ్బ తిన్నందున, పీఓఎస్‌ల ఏర్పాటు 2021-22లోనూ అతి తక్కువగా జరిగినా, గణాంకాలకు పరిగణనలోకి తీసుకోలేదు.2023 మార్చి నుంచి 2024 వరకు కొత్త పీఓఎస్‌ టెర్మినళ్ల ఏర్పాటు 14 శాతమే పెరిగింది. అంతకు ముందు రెండేళ్లు వరుసగా 28%, 29% అధికమై 89 లక్షలకు చేరాయి. 2016-17లో వేగవంతమైన వృద్ధి నమోదైంది. ఆ ఏడాదిలో ఏకంగా పీఓఎస్‌ల ఏర్పాటులో 82% వృద్ధి నమోదైంది. పెద్ద నోట్ల రద్దు వల్ల, నగదు అందుబాటులో లేక, అధికులు కార్డులతో లావాదేవీలు నిర్వహించడమే ఇందుకు కారణం. అప్పుడే యూపీఐ లావాదేవీలు పెరగడమూ ప్రారంభమైంది. 2016లో దేశీయంగా 13.8 లక్షల పీఓఎస్‌ యంత్రాలు ఉండేవి.

  • యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి ప్లాట్‌ఫామ్‌లు గత రెండేళ్లలో రెండింతల వృద్ధి నమోదు చేశాయి. వీటి క్యూఆర్‌ కోడ్‌లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్ల నుంచి వీధి చివర్లో దుకాణాల వరకు క్యూఆర్‌-కోడ్‌ స్టిక్కర్లు సర్వసాధారణమైపోయాయి.
  • ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 34.6 కోట్ల క్యూఆర్‌ కోడ్‌లు ఈ ఏడాది మార్చిలో వినియోగంలో ఉన్నాయి. 2022 మార్చిలో చూస్తే ఇవి 17.2 కోట్లే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లతో స్కాన్‌ చేయడం ద్వారా సులువుగా చెల్లింపులు చేసే అవకాశం ఉండటంతో యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. కార్డ్‌ స్వైప్‌ల ద్వారా అయితే, మర్చంట్లు ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) ఫీజు చెల్లించాల్సి రావడం వల్ల కూడా ఇందుకు మరో కారణం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని