CBDC: డిజిటల్‌ రూపీ ప్రయోగాలు.. ఇక మరిన్ని నగరాలకు

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా పేర్కొనే ఇ-రూపీ ప్రయోగాలను మరింత విస్తరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మరిన్ని బ్యాంకులను, మరిన్ని ప్రదేశాలను ఇందులో చేర్చనున్నట్లు పేర్కొంది.

Published : 30 May 2023 22:55 IST

ముంబయి: డిజిటల్‌ రూపీ ప్రయోగాలను క్రమంగా విస్తరిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా పిలిచే ఈ ఇ-రూపీని ప్రయోగాలను మరిన్ని ప్రాంతాలకు, బ్యాంకులకు విస్తరించనున్నట్లు పేర్కొంది. హోల్‌సేల్‌ వినియోగానికి సంబంధించి డిజిటల్‌ రూపీ (e rupee-W) ప్రయోగాలను గతేడాది నవంబర్ 1న ప్రారంభించగా.. అదే ఏడాది డిసెంబర్‌ 1న రిటైల్‌ వినియోగానికి సంబంధించిన డిజిటల్‌ రూపీ (e rupee-R) ప్రయోగాలు మొదలయ్యాయి. తొలుత ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎంపిక చేసిన కస్టమర్లు, వ్యాపారుల మధ్య లావాదేవీలకు వినియోగిస్తున్నారు. తర్వాత అహ్మదాబాద్‌, చండీఘడ్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, హైదరాబాద్‌, ఇందౌర్‌, కోచి, లఖ్‌నవూ, పట్నా, శిమ్లా నగరాల్లో కూడా ఈ ప్రయోగాలు ప్రారంభిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

అలాగే, తొలుత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌తో డిజిటల్‌ రూపీ ప్రయోగాలు ప్రారంభించారు. తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులకు విస్తరించారు. త్వరలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లను ఈ ప్రయోగాల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అవసరాన్ని బట్టి మరిన్ని బ్యాంకులు, యూజర్లు, ప్రాంతాలను క్రమంగా ప్రయోగాల్లో భాగస్వాములను చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని