Maruti Suzuki: మారుతీ సుజుకీకి ₹200 కోట్ల భారీజరిమానా.. ఎందుకంటే?

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌)కు షాక్‌. వాహనాల డిస్కౌంట్ల విషయంలో డీలర్లను కట్టడి చేసి, తద్వారా మార్కెట్‌లో

Published : 23 Aug 2021 23:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌)కు షాక్‌. వాహనాల డిస్కౌంట్ల విషయంలో డీలర్లను కట్టడి చేసి, తద్వారా మార్కెట్‌లో పోటీ వాతావరణాన్ని దెబ్బతీసినట్లు తన దర్యాప్తులో గుర్తించిన ‘ది కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) మారుతీ సుజుకీకి రూ.200 కోట్ల భారీ జరిమానా విధించింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

అసలేం జరిగిందంటే.. వినియోగదారులకు అందించే డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను నియంత్రిస్తూ తన డీలర్లతో ‘డిస్కౌంట్‌ కంట్రోల్‌ పాలసీ’ని అమలు చేయించినట్లు సంస్థపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీసీఐ.. ఈ వ్యవహారంపై 2019 జులైలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ పాలసీని ఉల్లంఘించినట్లు తేలితే డీలర్‌తోపాటు అందులోని సిబ్బందికీ జరిమానా విధిస్తామని సంస్థ బెదిరించినట్లు గుర్తించింది. వినియోగదారుల్లా నటిస్తూ.. డిస్కౌంట్లపై ఆరా తీసేందుకు కొంతమందిని నియమించినట్లు కనుగొంది. ఈ చర్యలతో డీలర్ల మధ్య పోటీ వాతావరణం దెబ్బతినడంతోపాటు వినియోగదారుల ప్రయోజనాలపై ప్రభావం పడినట్లు తేల్చింది. తప్పుడు విధానాల అమలును నిలిపివేయాలని పేర్కొంటూ.. 60 రోజుల్లోగా జరిమానాను డిపాజిట్ చేయాలని తాజాగా ఆదేశించింది. దీనిపై మారుతీ సుజుకీ సంస్థ స్పందించింది. సీసీఐ జరిమానాపై చట్టపరంగా ముందుకెళతామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని