‘అలారమ్‌ స్టాపర్ల విక్రయాలు ఆపేయండి’.. ఇ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం ఆదేశం

ప్రయాణికుల భద్రత రీత్యా కార్ సీట్ బెల్ట్ అలారమ్‌ స్టాపర్ క్లిప్‌లను తమ వేదికల నుంచి శాశ్వతంగా తొలగించాలని కేంద్రం ఇ-కామర్స్‌ సంస్థలకు ఆదేశించింది 

Published : 12 May 2023 20:06 IST

దిల్లీ: కారు సీటు బెల్ట్‌ అలారమ్‌ స్టాపర్‌ క్లిప్‌లకు చరమగీతం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి విక్రయాలను నిలిపివేయాలని ఇ-కామర్స్‌ సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు తమ వేదికల నుంచి శాశ్వతంగా వాటిని తొలగించాలంటూ అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు ఐదు ఇ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. సీటు బెల్ట్‌ ధరించని సమయంలో వచ్చే అలారం సౌండ్‌ను ఆపేందుకు ఉపయోగించే ఈ స్టాపర్ల వల్ల ప్రయాణికుల భద్రతకు హాని కలిగే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌, మీషో ఫ్లాట్‌ఫామ్‌లలో శాశ్వతంగా అన్ని కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లు తొలగించాలని సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐదు ఇ-కామర్స్‌ నుంచి 13,118 కార్‌ సీట్ బెల్ట్‌ స్టాపర్‌ క్లిప్‌లను తొలగించారు. అమెజాన్‌ అత్యధికంగా 8,095 క్లిప్‌లను తొలగించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ 4,000-5,000, మీషో 21, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌లలో ఒక్కొక్కటి డీలిస్ట్ చేసినట్లు సీసీపీఏ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ చట్టం (CCPA) 2019 కింద వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనైతిక వ్యాపార పద్ధతుల నిరోధించడంలో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. 

రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం 2021 సంవత్సరంలోనే సీటు బెల్ట్‌ ధరించని కారణంగా 16 వేల మంది మరణించారు. ఇందులో 8,438 మంది డ్రైవర్లు, 7,959 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతే కాకుండా 39,231 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 16,416 మంది వాహన చోదకులు, 22,818 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో మూడో వంతు మంది 18 నుంచి 45 ఏళ్ల వయసులోని వారు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని