Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయంపై పన్ను విధించే యోచనలో కేంద్రం?

Netflix: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్‌ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 

Published : 12 May 2023 12:51 IST

దిల్లీ: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)కు స్ట్రీమింగ్‌ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై కేంద్రం పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే విదేశీ డిజిటల్ కంపెనీలపై భారత్‌ తొలి సారి పన్ను విధించినట్లవుతుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం, అటు నెట్‌ఫ్లిక్స్‌ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. 

 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు రూ.55 కోట్ల ($6.73 మిలియన్ల) ఆదాయం వచ్చినట్లు కేంద్ర పన్నుల విభాగం అంచనా వేసింది. అమెరికాకు చెందిన ఈ ఓటీటీ దిగ్గజం తమ స్ట్రీమింగ్‌ కార్యకలాపాలను భారత్‌లో కొనసాగించేందుకు మాతృసంస్థ నుంచి తాత్కాలికంగా ఉద్యోగులను ఉపయోగించుకుంటోంది. అదే తరహాలో మౌలిక వసతులను సైతం వాడుకుంటోంది. దీంతో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌ పర్మినెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (PE) కిందకు వస్తుందని పన్ను విభాగానికి చెందిన అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. భారత్‌లో పీఈలన్నీ పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నియంత్రించటంలో భాగంగా విదేశీ కంపెనీలు భారత్‌లో ఆర్జించే ఆదాయంపై పన్ను విధించాలని కేంద్రం గతకొంతకాలంగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్‌ పన్ను తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని