ప్రచారం ఎందుకో చెప్పాలి..? సెలబ్రిటీలకు వినియోగదారుల శాఖ కొత్త మార్గదర్శకాలు

వినియోగదారుల పరిరక్షణ చట్టానికి మరింత బలం చేకూర్చి, చట్ట విరుద్ధంగా జరిగే ఉత్పత్తుల ప్రచారాల(Brand Ambassdors)ను కట్టడి చేసేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు వినియోగదారుల శాఖ (Department of Consumer Affairs) వెల్లడించింది. 

Updated : 06 Mar 2023 19:59 IST

దిల్లీ: వాణిజ్య ప్రకటనల్లో (Brand Ambassdors) నటించే సెలబ్రిటీలు(Celebrities), సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్ల (Social Media Influencers)కు వినియోగదారుల వ్యవహారాల శాఖ (Department of Consumer Affairs) సోమవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రకటనలు ఎందుకో తెలియాలి (Endorsements Know-hows) పేరుతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. దానివల్ల సెలబ్రిటీలు తాము ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు తెలుస్తుంది. 

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు లేదా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సామాజిక మాధ్యమాల ద్వారా పలు కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో చాలా వరకు వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటంతోపాటు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలు వినియోగదారులకు ఫలితాలను ఇవ్వటంలేదని వినియోగదారుల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో  వినియోగదారుల పరిరక్షణ చట్టానికి మరింత బలం చేకూర్చి, చట్ట విరుద్ధంగా జరిగే ఉత్పత్తుల ప్రచారాలను కట్టడి చేసేందుకు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు వినియోగదారుల శాఖ వెల్లడించింది. 

‘‘సెలబ్రిటీలు లేదా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు వ్యక్తిగతంగా ఉపయోగించకుండా.. ఎలాంటి ఉత్పత్తికైనా ప్రచారం చేయకూడదు. ఒకవేళ ప్రచారం చేసేట్లయితే.. సదరు ఉత్పత్తిని వినియోగించిన తర్వాత తమకు ఎదురైన అనుభవాలను ప్రకటనలో వివరించాలి. అలానే సెలబ్రిటీలు తాము ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు అర్థమయ్యేలా సులభతరమైన పద్ధతిలో బహిర్గతం చేయాలి. అది టెక్ట్స్‌/ఆడియో/వీడియో రూపంలోనైనా ఉండొచ్చు. ఒకవేళ లైవ్‌లో ప్రచారం చేస్తున్నట్లయితే.. ప్రసారం అవుతున్నంతసేపు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు తెలిసేలా స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయాలి. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేట్లయితే హ్యాష్‌టాగ్‌ ద్వారా తెలియజేయాలి. 

సెలబ్రిటీలు తాము సదరు ఉత్పత్తికి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అది కేవలం ప్రకటన (Adevertisement) మాత్రమేనా? ఆయా కంపెనీల నుంచి నగదు (Sponsered) తీసుకున్నారా? లేదా ఆ కంపెనీలతో ఒప్పందం (Collaboration) చేసుకున్నారా? లేదా ఆయా కంపెనీలలో వారికి భాగస్వామ్యం (Patnership) ఉందా? అనేది యూజర్లకు తెలిసేలా ప్రకటనలో చూపించాలి ’’ అని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు