Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన కేంద్రం

దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది....

Updated : 26 May 2022 16:45 IST

దిల్లీ: దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల(petrol price) పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50లు, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, పీఎం ఉజ్వల్‌ యోజన పథకం కింద 9కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ. 200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐరన్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ముడి పదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్టు తెలిపింది. 

ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులతో దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ రాష్ట్రాల్లోనూ వ్యాట్‌ తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు మినహా దాదాపు దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తులపై కొంత మేరకు పన్నులు తగ్గించడంతో వాహనదారులకు ఊరట దక్కింది. అయితే, ఆ తర్వాత కూడా విపరీతంగా ధరలు పెరగడం, పెట్రోల్‌ ధరలు రూ.110, డీజిల్‌ దాదాపు రూ. వందకు చేరుకున్న పరిస్థితుల్లో మరోసారి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రధానితో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత, పలురకాల అధ్యయనాల సూచనల ఆధారంగా ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.  

ఎక్సైజ్‌ సుంకం తగ్గింపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ కాసేపట్లో రాబోతోందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ఏడాదికి దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా. పీఎంవో ఇచ్చిన సూచనలు, ప్రధాని ఇటీవల పలు కమిటీలు, పలువురు నిపుణులతో జరిపిన చర్చల్లో ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం కావడంతో పీఎంవో స్వయంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని