Union Budget 2024: జులై 22న కేంద్ర బడ్జెట్‌.. జులై 3న ఆర్థిక సర్వే..!

Union Budget 2024: ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్రం జులై 22న ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు జులై 3న ఆర్థిక సర్వేను వెల్లడించేందుకు సిద్ధమవుతోంది.

Updated : 17 Jun 2024 17:27 IST

దిల్లీ: మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక వర్షాకాల సమావేశాలకు (Parliament Monsoon Session) కూడా షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ (Union Budget 2024)ను ప్రవేశపెట్టనుందట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ (Lok Sabha) సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

ఈ క్రమంలోనే జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని