Videocon Group case: వీడియోకాన్‌ ఛైర్మన్ వేణుగోపాల్ దూత్ అరెస్టు

వీడియోకాన్‌ గ్రూప్‌ కేసులో మరో కీలక అరెస్టు చోటుచేసుకుంది. ఇప్పటికే కొచ్చర్ దంపతులను సీబీఐ అదుపులోకి తీసుకోగా.. తాజాగా వీడియోకాన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ దూత్‌ను అరెస్టు చేసింది.  

Published : 26 Dec 2022 13:41 IST

దిల్లీ: ఐసీఐసీఐ(​ICICI) బ్యాంకు మోసం కేసులో వరుస అరెస్టులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. వీడియోకాన్(Videocon) ఛైర్మన్ వేణుగోపాల్ దూత్‌(Venugopal Dhoot)ను అరెస్టు చేసింది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్‌(Chanda Kochhar), ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వీడియోకాన్‌ గ్రూప్‌ (Videocon loan case) కంపెనీలకు 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారడంతో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలోనే కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్‌ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

ఈ కేసులో భాగంగా శుక్రవారం కొచ్చర్‌ దంపతులను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. కాగా.. ఈ ఆరోపణల నేపథ్యంలో 2018లో చందా కొచ్చర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ పదవుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత దీపక్‌ కొచ్చర్‌కు చెందిన సంస్థలో దూత్‌ రూ. 64కోట్ల పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని