Cashless Claim: నగదు రహిత ఆరోగ్య బీమా ఉందని ధీమాగా ఉన్నారా? ఈ సవాళ్లు ఎదురవ్వొచ్చు!

నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థలే నేరుగా ఆసుపత్రికి బిల్లు మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీదారుడు చెల్లించాల్సిన పని ఉండదు. మరి అన్ని సార్లు ఇది పని చేస్తుందా?

Published : 11 Nov 2022 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్యం కోసం పాలసీదారుడు ఆసుపత్రిలో చేరినప్పుడు.. పాలసీదారుడు బిల్లు మొత్తాన్ని చెల్లించి ఆ తర్వాత బీమా సంస్థ నుంచి క్లెయిం చేసుకోవాలి. అయితే, నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థలే నేరుగా ఆసుపత్రికి బిల్లు మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీదారుడు చెల్లించాల్సిన పని ఉండదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే, సాధారణ క్లెయిం మాదిరిగా ముందుగా సొమ్ము చెల్లించి తిరిగి వస్తుందా? లేదా? అని ఆందోళన ఉండదు. అందుకే నగదు రహిత చికిత్సలను అందించే పాలసీలను ఎంచుకోమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే, నగదు రహిత పాలసీల విషయంలోనూ పాలసీదారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే.. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తొలగించుకోవచ్చు. 

పాక్షిక క్లెయిం సెటిల్‌మెంట్

నగదు రహిత బీమాలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య పాక్షిక క్లెయిమ్ సెటిల్‌మెంట్. ఇది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్సకు అయిన ఖర్చులో నిర్దిష్ట భాగాన్ని మాత్రమే నగదు రహితంగా బీమా సంస్థ కవర్‌ చేస్తుంది. పెండింగ్‌ మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించి తర్వాత బీమా సంస్థ నుంచి క్లెయిం చేసుకోవాలి.

ఉదాహరణకు పాలసీదారుడు శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. ఇందుకోసం అయిన బిల్లు రూ. 30 వేలను నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థ చెల్లించింది. ఆపరేషన్‌ తర్వాత కాంప్లికేషన్లు రావడంతో మరికొంత కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు మొత్తం బిల్లు రూ. 40 వేలు అయ్యిందనుకుంటే.. మిగిలిన రూ. 10 వేలు నగదు రహితంగా క్లెయిం చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో పాలసీదారుడు స్వయంగా బిల్లు చెల్లించి తర్వాత రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

నెట్‌వర్క్‌ ఆసుప్రతులు..

నగదు రహిత చికిత్సను పొందేందుకు బీమా సంస్థతో టైఅప్ ఉన్ననెట్‌వర్క్‌ ఆసుపత్రిలో మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నెట్‌వర్క్‌ ఆసుపత్రి అందుబాటులో లేక వేరే ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే నగదు రహిత సదుపాయం లభించదు. చికిత్స కోసం చేసిన ఖర్చులను పాలసీదారుడే స్వయంగా చెల్లించి.. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందువల్ల, పాలసీ తీసుకునే ముందు పాలసీదారుడు నెట్‌వర్క్‌ ఆసుప్రతుల జాబితాను తనిఖీ చేయాలి. నివాస ప్రాంతానికి దగ్గరలో నెట్‌వర్క్‌ ఆసుపత్రి ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది.

డాక్యుమెంటేషన్..

నగదు రహిత చికిత్సలు పొందడం కోసం కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రీ-ఆథరైజేషన్‌ ఫారం టీపీఏ (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్)కు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. చికిత్స సమయంలో, ఆ తర్వాత కూడా కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు. అత్యవసర పరిస్థితుల కారణంగా డాక్యుమెంట్లను సకాలంలో ఇవ్వడంలో పాలసీదారులు విఫలం కావచ్చు. ఫలితంగా నగదు రహిత క్లెయిం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గుర్తింపు కోసం టీపీఏ అందించే హెల్త్‌కార్డులను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది. అలాగే, చికిత్స కోసం ప్రణాళిక ప్రకారం ఆసుపత్రిలో చేరితే ఆథరైజేషన్‌ ఫారంతో పాటు అన్ని డాక్యుమెంట్లను ముందుగానే సమర్పించడం మంచిది. 

క్లెయిం ప్రక్రియలో జాప్యం..

అత్యవసర సందర్భాల్లో నగదు రహిత క్లెయిం పరిష్కారం సవాలుగా మారుతుందనే చెప్పాలి. కొన్ని చికిత్సలు వెంటనే చేయాల్సి రావచ్చు. ఆలస్యం కాకుండా ఉండేందుకు బిల్లులను వెంటనే చెల్లించమని వైద్యులు కోరవచ్చు. అలాంటి సందర్భంలోనూ స్వయంగా డబ్బు చెల్లించి, రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఆన్‌లైన్‌ ద్వారా త్వరగా నగదు రహిత క్లెయింలను పరిష్కరించగల, బలమైన నెట్‌వర్క్‌ ఉన్న బీమా సంస్థలను ఎంచుకోవడం మంచిది.

మినహాయింపులు..

కొన్ని చికిత్సలు నగుదు రహిత క్లెయింల కింద మినహాయిస్తారు. ఇవి పాలసీను బట్టి మారుతుంటాయి. డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, రెగ్యులర్‌ చెక్‌-అప్‌లు, ప్రత్యేక వైద్య పరీక్షలు వంటివి నగదు రహిత క్లెయింల పరిధిలోకి రాకపోవచ్చు. కాబట్టి, పాలసీదారులు ముందుగానే మినహాయింపుల గురించి తెలుసుకోవాలి.

చివరిగా..

ఆరోగ్య బీమా క్లెయింల విషయంలో తప్పు బీమాసంస్థ, టీపీఏ, పాలసీదారుడు ఎవరు చేసినా అంతిమంగా నష్టపోయేది పాలసీదారుడే. అందువల్ల పాలసీ తీసుకున్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు, పాలసీ కవర్‌ చేసే వ్యాధుల జాబితా, మినహాయింపులు వంటివి తెలుసుకోవాలి. అలాగే క్లెయిం చేసేటప్పుడు బీమా సంస్థ నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించడం మంచిది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని