Air India: ఎయిరిండియా ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌.. బోర్డు ఆమోదం

Air India: ఎయిరిండియా ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్‌కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Published : 14 Mar 2022 19:18 IST

దిల్లీ: ఎయిరిండియా ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్‌కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై విమానయాన సంస్థకూ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎయిరిండియా బోర్డు ఆయన నియామకానికి సోమవారం ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా గ్రూప్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఈ నియామకం చోటుచేసుకుంది. ఎయిరిండియా ఛైర్మన్‌తో పాటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీగా వ్యవహరించిన అలైస్‌ గీ వర్గీస్‌ వైద్యన్‌ను బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 

2016లో టాటా సన్స్‌ బోర్డులో చేరిన చంద్రశేఖరన్‌ 2017లో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటికే టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, టీసీఎస్‌ కంపెనీలకు ఛైర్మన్‌గా వ్యవవహరిస్తున్నారు. మరోవైపు కొత్త సీఈవోను సైతం ఎయిరిండియా త్వరలో నియమించనుంది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఛైర్మన్‌ ఇల్కర్‌ అయిసీని నియమించేందుకు గత నెల బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ.. అనివార్య కారణాలతో ఆయన బాధ్యతలను చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో కొత్త సీఈవో కోసం టాటా గ్రూప్‌ అన్వేషిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని