Post Office: పోస్టల్‌ పొదుపు ఖాతాకు వర్తించే 8 రకాల ఛార్జీల గురించి తెలుసా?

పోస్టాఫీసు పొదుపు పథకాలకు ప్రభుత్వ మద్దతు ఉండడంతో ప్రజల పెట్టుబడులు సురక్షితంగా ఉండడంతో పాటు రాబడికి హామీ ఉంటుంది

Published : 15 Feb 2023 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ ఆదాయం ఉన్నవారు సైతం పొదుపు చేయగలిగే విధంగా పోస్టాఫీసు (Post office) చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. వివిధ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా వ్యక్తి వయసు, కాలపరిమితి, పన్ను ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పోస్టాఫీసు ఈ పథకాలను రూపొందించింది. ఈ పథకాలకు ప్రభుత్వ మద్దతు ఉండడంతో ప్రజల పెట్టుబడులు సురక్షితంగా ఉండడంతో పాటు రాబడికి హామీ ఉంటుంది.  

పోస్టాఫీసు పొదుపు ఖాతా..

పోస్టాఫీసు పొదుపు ఖాతా ఇతర బ్యాంకు ఖాతాల మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో కనీస డిపాజిట్‌ రూ.500. కనీస విత్‌డ్రా మొత్తం రూ.50. పొదుపు ఖాతాపై 4% వడ్డీ పొందొచ్చు. పిల్లలు, పెద్దలు కూడా పోస్టాఫీసు పొదపు ఖాతాలను తెరవచ్చు. ఖాతాలో డిపాజిట్‌ చేసే మొత్తంపై గరిష్ఠ పరిమితి లేదు. వడ్డీ ఆదాయంపై రూ.10 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

విత్‌డ్రా..

పోస్టాఫీసు పొదుపు ఖాతాలో రూ.500 కంటే తక్కువ ఉంటే విత్‌డ్రాలను అనుమతించరు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.500 ఖాతాలో లేకపోతే, నిర్వహణ రుసముల కింద రూ.50 ఖాతా నుంచి డిడక్ట్‌ చేస్తారు. ఖాతాలో బ్యాలెన్స్‌ సున్నాకి చేరితే ఖాతా రద్దు అవుతుంది. 

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాపై వర్తించే 8 రకాల ఛార్జీలు..

  • డూప్లికేట్‌ పాస్‌బుక్‌ జారీ కోసం.. రూ. 50
  • ఖాతా స్టేట్‌మెంట్‌ లేదా డిపాజిట్‌ రసీదు జారీ కోసం.. రూ. 20 (జారీ చేసిన ప్రతిసారీ వర్తిస్తుంది)
  • పోగొట్టుకున్న లేదా మ్యుటిలేటెడ్ సర్టిఫికేట్‌ బదులు పాస్‌బుక్‌ జారీకి.. రూ.10(ప్రతి రిజిస్ట్రేషన్‌కు)
  • నామినేషన్‌ రద్దు లేదా మార్పు కోసం.. రూ. 50
  • ఖాతా బదిలీకి.. రూ.100
  • ఖాతాపై తాకట్టుకు.. రూ.100
  • పొదుపు ఖాతాలో చెక్‌బుక్‌ జారీ.. క్యాలెండర్‌ సంవత్సరంలో 10 చెక్‌లీఫ్‌లు ఉచితంగా లభిస్తాయి. రుసుములు విధించరు. ఆ తర్వాత.. లీఫ్‌కు రూ. 2 చొప్పున ఛార్జ్‌ చేస్తారు. 
  • చెక్కు బౌన్స్/ క్యాన్సిల్‌ అయితే.. రూ.100 ఛార్జ్‌ చేస్తారు. 

పైన తెలిపిన సేవా ఛార్జీలపై పన్ను కూడా వర్తిస్తుంది.

సాధారణ పొదుపు ఖాతా (SB)తో పాటు స్వల్ప, దీర్ఘకాల ప్రయోజనాలతో వివిధ పథకాలను పోస్టాఫీసు అందిస్తోంది. పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ (RD), నేషనల్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా (TD), నేషనల్‌ సేవింగ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ (MIS), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం ఖాతా (SCSS), పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (VIIIth Issue) (NSC), సుకన్య సమృద్ధి ఖాతా (SSA) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. వీటితో పాటు తాజా బడ్జెట్‌లో మహిళా పెట్టుబడిదారుల కోసం మహిళా సమ్మాన్‌ యోజనను ప్రభుత్వం లాంచ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని