ChatGPT: చాట్‌జీపీటీ గొప్పదే.. కానీ, ఉద్యోగుల్ని భర్తీ చేయలేదు: నారాయణ మూర్తి

ఉత్పాదకతను పెంచేందుకు చాట్‌జీపీటీ (ChatGPT) వంటివి మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే ఉపయోగపడతాయని ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి  (Narayan Murthy) అభిప్రాయపడ్డారు. 

Published : 21 Apr 2023 17:10 IST

ముంబయి: చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (AI) ఆధారిత చాట్‌బాట్‌లు మనుషులను భర్తీ చేయలేవని ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayan Murthy) అన్నారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాచార సేకరణకు, విషయ సముపార్జనకు చాట్‌జీపీటీ గొప్ప సాధనం. కానీ, కొన్ని విషయాల్లో అది మనుషులతో పోటీ పడలేదు. మనిషి మెదడును మించిన యంత్రం మరోటి లేదని నమ్మే వారిలో నేను ఒకణ్ని. కాబట్టి, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లు ఎప్పటికీ మనుషులను భర్తీ చేయలేవు’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఏఐ చాట్‌బాట్‌లు ఉద్యోగులను భర్తీ చేస్తాయన్న ఆందోళనల నేపథ్యంలో నారాయణ మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి. ఉత్పాదకతను పెంచేందుకు చాట్‌జీపీటీ వంటివి మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే ఉపయోగపడతాయని ఆయన అభిప్రాపడ్డారు. ఇద్దరు వ్యక్తులు చాట్‌జీపీటీని ఒకే విధమైన ప్రశ్న అడిగితే.. వారివురికి ఒకే సమాధానం వస్తుంది. కానీ, ఆ సమాధానానికి ఇద్దరిలో ఒకరు అదనంగా తమ సృజనాత్మకతను జోడించి మెరుగైన ఫలితం పొందినట్లు చూపించవ్చని నారాయణ మూర్తి వెల్లడించారు. చాట్‌జీపీటీ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవరంలేదని చెప్పారు. మనిషి సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతికత కలిస్తే ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. 

గతంలో కూడా ఒక సదస్సులో పాల్గొన్న నారాయణ మూర్తి, చాట్‌జీపీటీపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదనలు వెలువడిన నేపథ్యంలో మూర్తి వాటితో విభేదించారు. కొద్దిరోజుల క్రితం ఏఐ, చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సహా పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని